‘ఇందిర’ బాటలో ‘మోడీ’..?
ఇమేజ్, చరిష్మాలో ప్రధానమంత్రి మోడీ… బీజేపీని దాటేశారు. ఇప్పుడు ఎక్కడ బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినా.. వారు బీజేపీ గుర్తు కన్నా మోడీ ఇమేజ్ నే నమ్ముకుంటున్నారు. బీజేపీ సభల్లోనూ మోడీ వస్తేనే హుషారు కనిపిస్తోంది.దీంతో దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా మోడీ ప్రచారం చేయాల్సిందే. అప్పుడే పరిస్థితులు టర్న్ అయి, గెలుపు ఖాయమన్న భావన పార్టీ నేతల్లో వచ్చేసింది. ఓవిధంగా చూస్తే నాణేనికి ఓవైపు మాత్రమే. కానీ నాణేనికి రెండోవైపు చూస్తే.. మోడీ తర్వాత అన్న మాటకు సరైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన నేతలకు .. ఢిల్లీలో పెద్దపీట వేయడం, తర్వాతి నాయకత్వాన్ని తయారు చేయడం.. జాతీయపార్టీల్లో సంప్రదాయంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు బీజేపీలో మాత్రం ఆపరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రస్థాయిలో బీజేపీ పతాకాన్ని రెపరెపలాడించిన నేతలకు.. ఇప్పుడు పూర్తిగా గడ్డుపరిస్థితి ఎదురవుతోంది. వారి స్థానాల్లో కొత్తవారు, లేదా మరికొందరిని సాక్షాత్తూ అధిష్టానమే ప్రోత్సహిస్తోంది. అందునా.. వారికి ఫస్టులిస్టులో టికెట్లు రాని అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనిస్తే.. ఇందిర జమానాలో కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఎదుర్కొన్న పరిస్థితితో సారూప్యత కనిపిస్తోంది.
1970, 80ల్లో ఇందిర అంటే.. కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిర అన్నట్లు ప్రచారం సాగింది. ఇందిరకు విధేయత ఉన్నవారికి… పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. రాష్ట్రనేతలకు.. ఢిల్లీలో అస్సలు గౌరవం దక్కని పరిస్థితి దాపురించింది. దీంతో ప్రతీ ఎన్నికకు ఇందిరను చూసి జనం ఓటేసిన పరిస్థితులున్నాయి. ఇది చివరకు ఎటు దారితీసిందంటే.. రాష్ట్రాల్లో నాయకత్వలేమికి బీజం వేసింది.ఒక్కో రాష్ట్రంలో ఇద్దరేసి, ముగ్గురేసి బలమైన నేతలు తయారయ్యారు. వీరిలో వీరు కొట్టుకోవడంతో.. తదుపరి దశాబ్దాల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనమైన పరిస్థితి ఉంది.
ఇప్పుడు బీజేపీలోనూ అదే పరిస్థితి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ లాంటి ఘనాపాటికి.. టికెట్ విషయంపై ఊహాగానాలు వచ్చిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. ప్రధానమంత్రి మోడీ ప్రసంగంలో ఎక్కడా మామ ప్రస్తావన రాలేదు. దీనికి తోడు స్వయంగా శివరాజ్ సింగ్.. తాను సీఎం అవుతానా అంటూ ప్రజల్ని కోరిన పరిస్థితులున్నాయి. ఇక రాజస్థాన్ లో కాకలు తీరిన వసుంధరకు దియా కుమారి రూపంలో ప్రత్యర్థిని పార్టీ డిసైడ్ చేసింది. ఇలా ఎక్కడ రాష్ట్రాల్లోనేతలను ఎదగకుండా చేస్తూ వస్తుండడంతో.. ఇక అంతా మోడీయే అన్నట్లు తయారైంది.
తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంతో పాటు పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. తన నాయకత్వానికి ధీటుగా ఇంకెవరు ఎదగకుండా అందరినీ తొక్కిపడేశారు. దానివల్ల ఇపుడేమైందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అందరు మోడీవైపు మాత్రమే చూస్తున్నారు.
సొంత బలం ఉన్న నేతల్లో చాలామందిని ఎందుకు పనికిరాని వారి కింద మోడీ మార్చేశారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో సమర్ధులున్నా వాళ్ళెవరు ఏ విషయంలోను జోక్యం చేసుకోవటంలేదు. ప్రతి విషయాన్ని మోడీ నిర్ణయానికే వదిలేస్తు కొందరు సీనియర్ మంత్రులు కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయటానికి మాత్రమే పరిమితమైపోయారు. మిగిలిన మంత్రుల్లో ఎలాగూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని యాక్ట్ చేసే అవకాశాలు లేవు.













