జనం బాటలో..
మొన్నటికి మొన్న శివసేనను చీల్చి కకావికలం చేశారు. ఓవర్గం నేత షిండేను మహారాష్ట్ర సీఎంను చేశారు. దీంతో శివసేన కాస్తా కోరలు లేని పులిలా తయారైంది. ఇప్పుడు ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చేశారు. కీలకనేత అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంను చేశారు. దీంతో మహారాష్ట్రలో ఎన్నికల ముందు విపక్షాలు శక్తివిహీనం అయిపోయాయి. ఫలితంగా ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి అత్యధిక ఎంపీసీట్లను గెల్చుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు.
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ కు మహావికాస్ కూటమి భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సారథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శరద్ పవార్‌ను ముంబైలోని వైబీ చవాన్ కార్యాలయంలో కలుసుకున్నారు. బీజేపీ-శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంవీఏ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టం ద్వారా క్యాడర్లో ఉత్సాహం నింపాలని, ఎంవీఏ ఐక్యంగా ఉందనే స్పష్టమైన సంకేతాలివ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన చేశారు.
ఎంవీఐ ఐక్యతకు ఎలాంటి ఢోకా లేదని పవార్ తో సమావేశం తర్వాత కాంగ్రెస్ నేతలు తెలిపారు. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేతో కలిసి మహారాష్ట్ర టూర్‌కు ప్లాన్ చేస్తున్నామని, దీనిపై ఉద్ధవ్ థాకరేతో శరద్ పవార్ మాట్లాడతారని చెప్పారు. అసెంబ్లీలో విపక్ష నేత ఎవరనే దానిపై పవార్, ఉద్ధవ్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు. దీంతో బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడే విషయంలో తగ్గేదే లేదని ఎంవీఐ నేతలు సంకేతాలిచ్చారు. పార్టీలు చీలినా ప్రజలు.. తమవెంటే ఉన్నారని చెబుతున్నారు.
ఎలాగు ఏడాదిలోగా మహారాష్ట్రలో ఎన్నికలు రావడం ఖాయం. దీంతో ఎన్నికలకు వెెళడానికి బీజేపీ నేతృత్వంలోని షిండే ప్రభుత్వం తమకో ఆయుధాన్నిచ్చిందని విపక్షాలు భావిస్తున్నాయి. పార్టీలను చీల్చి, నేతలను కలుపుకుని.. అధికారం సాదిద్దామని మహారాష్ట్రలోని అధికార కూటమి ప్రయత్నిస్తోందన్న నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నాయి. అదే గనుక జరిగితే, ఈసారి మహారాష్ట్రలో పవర్ లోకి వద్దామని భావిస్తున్న బీజేపీ కూటమికి.. చిక్కులొచ్చిపడ్డట్లేనని తెలుస్తోంది.













