జమిలి మరింత లేటు..
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలు జమిలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే…. 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేరకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు లా కమిషన్ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ఖర్చు, మానవ వనరులను తగ్గించుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాటిని కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు రూపొందిస్తున్నాయి. అయితే, ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ.. కొన్ని సమస్యలు పరిష్కారం కానందున లా కమిషన్ తుది నివేదిక సిద్ధం చేయలేదని తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చని లా కమిషన్ భావిస్తోందని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించడమే ప్రస్తుత లా కమిషన్ విధి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇటీవలే తొలి సమావేశం నిర్వహించిన ఈ కమిటీ.. దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.
ఏకకాల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తీ ఇటీవలే తెలిపారు. ఈ అంశంపై నివేదిక సమర్పణకు తుది గడువు ఏమీ లేదన్నారు. జమిలి ఎన్నికలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందన్నారు. దీనిపై తుది నివేదిక సిద్ధం కాలేదని చెప్పారు.
2018లో 21వ లా కమిషన్ ముసాయిదా నివేదికను కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని, అడ్మినిస్ట్రేషన్ పైన, భద్రతా బలగాలపైన భారం తగ్గుతుందని, ప్రభుత్వ పథకాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలవుతుందని ఆ నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్‌లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని కమిషన్ అభిప్రాయపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో సంబంధిత ప్రొవిజన్లను సవరించాలని కూడా సిఫారసు చేసింది.













