పీవీకి భారత రత్న.. కాంగ్రెస్ను మోదీ ఊహించని దెబ్బ కొట్టారా..?
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీలూ కాస్తోకూస్తో లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం కామన్. అయితే ఈ విషయంలో బీజేపీ కాస్త ముందుంటుందని చెప్పొచ్చు. తమ ముందున్న సవాళ్లను అధిగమించి వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆ పార్టీ పీహెచ్డీ చేసింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరిస్థితులను తమకు పాజిటివ్ గా మార్చుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పలువురు ప్రముఖులకు భారత రత్న పురస్కారాలను అందించిందని చెప్పొచ్చు. అద్వానీ, పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్ తదితరులకు ఈ ఏడాది భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.
అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం అహరహం శ్రమించారు ఎల్కే అద్వాని. ఆయన దేశవ్యాప్తంగా చేసిన రథయాత్ర హిందువుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి అయోధ్య ఆలయ నిర్మాణం కోసం హిందువులంతా పోరాడుతున్నారు. ఈ స్ఫూర్తి రగిలించిన అద్వానీ ఎన్నో కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆయన ధైర్యంగా పోరాడారు. ఒకవైపు అయోధ్య ఆలయం సాకారమైన సమయంలోనే అద్వానీకి భారతరత్న పురస్కారం అందించింది కేంద్రం. ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీని ఆహ్వానించకుండా అవమానించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వారం రోజులకే అద్వానీని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసి విమర్శలకు చెక్ పెట్టింది బీజేపీ.
ఇక పీవీ నరసింహారావును భారత రత్నకు ఎంపిక చేయడం బీజేపీ ముందుచూపుకు నిదర్శనం. దేశ ఆర్థిక సంస్కరణలను కొత్త పుంతలు తొక్కించారు పీవీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు అనేక విప్లవాలకు దారితీశాయి. గాంధేయేతర ఫ్యామిలీ నుంచి ప్రధానిగా ఐదేళ్లు పాలించిన ఏకైక వ్యక్తిగా పీవీ చరిత్ర సృష్టించారు. అయితే ఆయన ప్రధానిగా దిగిపోయిన తర్వాత అనేక కేసులు ఆయన్ను చుట్టుముట్టాయి. అయినా ఆయన లెక్కచేయకుండా పోరాడి క్లీన్ గా బయటికొచ్చారు. పీవీ మృతి చెందిన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఇప్పటికీ ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఢిల్లీలో ఆయన సమాధికి స్థలం కూడా కేటాయించలేదు. స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పి పట్టించుకోలేదు. అసలు పీవీకి తమ పార్టీకి సంబంధం లేదన్నట్టు వ్యవహరించింది కాంగ్రెస్. ఇది అనేక విమర్శలకు తావిచ్చింది.
పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును ప్రత్యర్థులు ఎప్పుడూ లేవనెత్తుతూనే ఉంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పీవీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి కాంగ్రెస్ తప్పిదాలను మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు మోదీ కూడా ఇదే పద్ధతిలో ముందుకెళ్లారు. పీవీ విషయంలో కాంగ్రెస్ వైఖరిని పలు సందర్భాల్లో మోదీ తప్పుబట్టారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. సొంత కుటుంబీకులకు భారతరత్న ఇచ్చుకున్నారు కానీ మహానుభావులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని రెండ్రోజుల కిందటే లోక్ సభలో మోదీ విమర్శించారు. ఇప్పుడు పీవీకి భారతరత్న ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ చేయలేని పని తాము చేశామని చెప్పుకునే అవకాశం బీజేపీకి కలిగింది. ఇది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేని అంశం. ఇప్పటికే చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇది మరింత ఇబ్బంది పెట్టడం ఖాయం.













