White house: ట్రంప్ అను నేను..

అమెరికా ఫస్ట్.. ప్రపంచం అసూయ పడేలా దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా.. ఇప్పుడిక స్వర్ణయుగం మొదలవుతుంది. 47వ అధ్యక్షుడిగా ప్రమాణం తర్వాత ట్రంప్ చేసిన తొలిస్పీచ్ లో కీలక వ్యాఖ్యలివి. అగ్రరాజ్యం పేరుప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను అరికడతామని, దేశ దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ వాషింగ్టన్ డీసీ(washington DC) క్యాపిటల్ హిల్(capitol hill) భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. తమ కుటుంబ బైబిల్‌ను, 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్‌ను చేతపట్టుకుని ఆయన దీనిని పూర్తిచేశారు.
రాజ్యాంగబద్ధంగా.. ప్రజాస్వామ్యయుతంగా..
‘‘రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా పాలన అందిస్తాం. దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. తీవ్రవాద కార్యకలాపాలను ఎంతమాత్రం సహించేది లేదు. న్యాయం అందజేయడంలో సంతులనం సాధిస్తాం. న్యాయ విభాగంలో, ప్రభుత్వంలో దుష్ట, హింసాత్మక, అనుచితమైన ఆయుధ పోకడకు తెరపడుతుంది. అమెరికాకు అత్యున్నత సేవలందించేందుకు పాటుపడతా. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటా. రెస్టారెంట్లలో కాల్పుల వంటి ఘటనలు జరగకుండా చూసుకుంటా. విద్యుత్తు వాహనాల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా అమెరికాను నిలబెడతా. శాంతిదూతగా, అందరినీ ఏకం చేసేలా ఉండాలని నేను భావిస్తున్నా. ప్రతిభకు పెద్దపీట వేసి వివక్షకు తావులేనిరీతిలో మా యంత్రాంగం ఉంటుంది. అమెరికా పౌరుల్ని సుసంపన్నుల్ని చేసేలా విదేశాలపై టారిఫ్‌లు విధిస్తాం. అమెరికాలోకి ప్రమాదకరమైన నేరగాళ్లు చొరబడి ఆశ్రయం పొందేలా మునుపటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. నాపై హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా చేయడానికి అవకాశం కల్పించాడు’’ అని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పలుమార్లు తమ స్థానాల్లో నుంచి లేచినిల్చొని కరతాళధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు. వైభవంగా జరిగిన ఈ వేడుకను తిలకించడానికి అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా(obama), బుష్(bush), క్లింటన్(clinton)లు వచ్చారు. వారిని చూస్తూనే సభలో కరతాళధ్వనులు మార్మోగాయి. తెలుగు మూలాలున్న ఉష(usha)ను వివాహం చేసుకున్న జె.డి.వాన్స్(JD vance) అంతకుముందు ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ఆయనచేత ప్రమాణం చేయించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన బైబిల్ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. అధ్యక్షుడు ప్రమాణం చేస్తున్నప్పుడు భవనం వెలుపల శతఘ్నులు పేల్చారు. కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలనియా(Melania), కుమార్తె ఇవాంక(Ivanka), అల్లుడు జేర్డ్ కుష్నెర్(kushner) పాల్గొన్నారు. సాధారణంగా ఎరుపు రంగు టై ధరించే ట్రంప్ ఈసారి మాత్రం ఊదారంగు టైతో వచ్చారు.
బైడెన్ తేనీటి విందు
ఒకరోజు ముందుగానే వాషింగ్టన్‌కు చేరుకున్న ట్రంప్ తొలుత ఓ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జో బైడెన్(biden) దంపతులు ట్రంప్ దంపతులకు సంప్రదాయం ప్రకారం తేనీటి విందునిచ్చారు. వాహనం దిగుతున్న ట్రంప్‌ను బైడెన్ స్వాగతిస్తూ ‘వెల్‌కమ్ హోం’ అని అన్నారు. తేనీటి విందు తర్వాత ట్రంప్, బైడెన్ తమ అర్థాంగులతో కలిసి క్యాపిటల్ భవంతికి చేరుకున్నారు. ట్రంప్‌నకు సంప్రదాయబద్ధంగా లేఖ రాశారా అని విలేకరులు ప్రశ్నించగా, అవునని బైడెన్ బదులిచ్చారు. దానిలో ఏముందని ప్రశ్నిస్తే అది తనకు, ట్రంప్‌నకు మధ్యనున్న విషయమని అన్నారు. అంతకుముందు కమలాహారిస్(kamala) దంపతులు నూతన ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దంపతులకు స్వాగతం పలికారు.
దిగ్గజాల హాజరు
కార్యక్రమంలో వివిధ దేశాల నేతలు, భారత్ తరఫున ప్రత్యేక దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హాజరయ్యారు. వీరితో టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టిక్‌టాక్ సీఈవో షోజీ చ్యూ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.