Trump: గ్రీన్ కార్డ్ లాటరీ నిలిపివేత.. ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. నిందితుడు పోర్చుగీస్ జాతీయుడు క్లాడియో నెవెస్ వాలెంటే (48)గా గుర్తించారు. ఆ తర్వాత నిందితుడు తనకు తానుగా తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
ఈ కాల్పుల నేపథ్యంలో గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం-ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను దేశంలో ఎప్పటికీ అనుమతించకూడదని పేర్కొన్నారు.
క్లాడియో నెవెస్ వాలెంటే 2017లో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను పొందాడు. దుండగుడు గ్రీన్‌కార్డ్ లాటరీ ద్వారానే అమెరికాకు వచ్చాడు. దీంతో ఈ విధానాన్ని నిలిపేస్తూ తాజాగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది వివిధ దేశాల ప్రజలకు లాటరీ ద్వారా 50,000 గ్రీన్ కార్డులు అందుబాటులో ఉంటాయి. 2025లో దాదాపు 20 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో గ్రీన్‌కార్డుల ప్రోగ్రామ్‌ను నిలిపివేశారు.






