నితీష్ కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ నిజమేనా..?

బిహార్ సీఎం నితీష్ కుమార్ కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవిని బ్లాంక్ చెక్ లా ఇచ్చిందా..? ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న ఆశతో కాంగ్రెస్ ఈ ప్లాన్ వేసిందా..? మరి అంత పెద్ద ఆఫర్ వస్తే నితీష్ ఎందుకు వదులుకున్నారు..? ఇండియా కూటమిని కాదని ఎన్డీఏతో ఎందుకు కొనసాగుతున్నారు. జేడీయూ నేత త్యాగి ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు.. రాజకీయంగా కలకలం రేపాయి. తమనేత నితీష్ కుమార్ కు.. ఇండియా కూటమి ఈఆఫర్ చేసిందని, అయితే నితీష్.. ఈ పదవిని తిరస్కరించారన్నారు త్యాగి.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేందుకు ఇండియా కూటమి తన సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని వార్తలు వినిపించాయి. అందుకోసం ఎన్టీయే మిత్రపక్షాలైన తెలుగు దేశం పార్టీ, జేడీ(యూ)లను తమ కూటమిలో చేర్చుకునేందుకు యత్నించిందని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నీతీశ్‌కు వచ్చిన ఆఫర్ గురించి తాజాగా పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జేడీయూనేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు..ప్రధానమంత్రి కావాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది. ఉన్న నేతల్లోసీనియర్ అయిన నితీష్.. ఆదిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ఇండియా కూటమికోసం కూడా బాగానే కష్టపడ్డారు. అయితే అక్కడ కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ పోటీగా ఉన్నారు. నితీష్ కోసం కొందరు మాట్లాడినా..అవి కార్యరూపం దాల్చేలా కనిపించలేదు. దీనికి తోడు పాత మిత్రపక్షం బీజేపీ మళ్లీ రమ్మని ఆహ్వానించడంతో ఇండియా కూటమికి బైబై చెప్పి, ఎన్డీఏ గూటికి చేరారు నితీష్. అయితే త్యాగి ప్రకటన వెనక కూడా కొన్ని రాజకీయ లక్ష్యాలున్నాయన్న అభిప్రాయాలున్నాయి.
ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీతో పాటు జేడీయూ బలంగా ఉంది. ఈ క్రమంలో తనకు అంత మంచి ఆఫర్ వచ్చినా వదిలి ఎన్డీఏ వెంటే ఉన్నాం కాబట్టి.. ఇక్కడ తమకు తగిన ప్రాధాన్యం దక్కాలని మోడీ,షాలకు నితీష్ ఈరకంగా సూచించారన్న భావన ఉంది. ఎంతైనా నితీష్ కు.. బీజేపీ గురించి, మోడీ,షాల గురించి బాగా తెలుసు కాబట్టి. వారి ముందరి కాళ్లకు ఇలా బంధం వేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. జేడీయూ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘‘నీతీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండియా కూటమి సంప్రదించడంపై కాంగ్రెస్‌కు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసు’’ అని హస్తం పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు.