కూటమిగా కదలాల్సిన సమయమిది..

పదేళ్లపాటు తిరుగులేని ఏకఛత్రాధిపత్యం చలాయించిన ప్రధానమంత్రి మోడీకి.. కూటమిగా నడవాల్సి రావడం సరికొత్త అనుభవం. ఇన్నాళ్లు తిరుగులేని మెజార్టీ ఉంది కాబట్టి.. ఏదైనా అనుకుంటే బుల్ డోజ్ చేసుకుంటూ దూసుకెళ్లారు.ఇప్పుడు అలా కుదురుతుందా.. అంటే కుదరదు. ఎందుకంటే కేబినెట్ కూర్పే దీనికి నిదర్శనంగా నిలువనుంది. ఇంతకుముందు వీరికి నచ్చి ఎన్డీఏలో ఏదైనా మిత్రపక్షానికి ఓ క్యాబినెట్ బెట్ కేటాయిస్తే, కేటాయించినట్లు .. ఇప్పుడు అలాకాదు.. వారికి హక్కులా మారనుంది. తమకు పలానా పోర్ట్ ఫోలియో కావాలని అడిగే పరిస్థితి టీడీపీ, జేడీయూకు వచ్చింది.వారిని కాదని ముందుకెళితే విపత్కర పరిస్థితులు తప్పవు.
ఎన్డీఏ బలంగా ఉండి, మోడీ హవా నడుస్తున్నప్పుడే చాలా మిత్రపక్షాలు.. వదిలి వెళ్లాయి. వదిలి వెళ్లాయి అనడం కన్నా.. మోడీ,షాల తీరు నచ్చక బైబై చెప్పాయి.దీంతో ఎన్నికల ముందు మిత్రపక్షాల అవసరాన్ని, సీట్లు తగ్గనున్నాయన్న సమాచారాన్ని గ్రహించి బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. టీడీపీ సహా కొన్ని మిత్రపక్షాలను తిరిగి ఎన్డీఏలో చేర్చుకుందికూడా. ఇప్పుడు ఆ మిత్రపక్షాలే బీజేపీకి అండగా ఉన్నాయి. మరి వాటిని కాదని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుందా..? అంటే కష్టమే అన్న ఆన్సర్ వస్తుంది.
మరీ ముఖ్యంగా కాంగ్రెస్ 99 సీట్లు సాధించిన ఉత్సాహంలో ఉంది. ఇండియా మిత్రపక్షాలు కూడా 200 సీట్లకు పైగా స్థానాలను సాధించాయి. ఓదశలో ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేద్దామన్న ఆలోచన చేసినట్లు సమాచారం.అయితే పరిస్థితులు కలిసిరాకపోవడంతో విపక్షంలో ఉండేందుకు సిద్ధమయ్యాయి.తక్కువ సీట్లున్నప్పుడే మోడీని.. రాహుల్ గట్టిగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు సీట్ల సంఖ్య పెరిగింది.. ఇండియా కూటమి బలం పెరిగింది. ఇప్పుడు ఇంకా టఫ్ ఫైట్ తప్పదన్న అభిప్రాయాలున్నాయి. ఇదే విషయాన్నికాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ క్లియర్ కట్ గా చెప్పారు. సీపీపీ నాయకురాలిగా ఎన్నికైన తర్వాత పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియాగాంధీ మాట్లాడుతూ క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు.‘‘ సీపీపీ సభ్యులుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉంది. పదేళ్లు పార్లమెంటులోని ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు’’ అని అన్నారు.
గత లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రిగా పనిచేసిన ఆమె మళ్లీ ఈ పదవికి ఎన్నికయ్యారు. అంటే ఇకపై పూర్తి జవాబుదారి తనంతో మోడీ సర్కార్ పనిచేయాల్సి ఉంటుంది. అంటే అటు మిత్రపక్షాలను మెప్పిస్తూ.. విపక్షాన్ని ఒప్పిస్తూ ద్విపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితులున్నాయి. మరి ఈకొత్త పాత్రలో మోడీ ఎంతవరకూ సఫలీకృతమవుతారో వేచిచూడాలి.