‘జననాల’ గండం
చైనాలో జనాభా గండం తీవ్రరూపు దాల్చింది. గతేడాది చైనాలో జననాలు మరో 10 శాతం క్షీణించాయి. దాంతో ఆ దేశంలోనే అత్యల్ప జననాలు సంభవించిన ఏడాదిగా రికార్డు నమోదైంది. జనాభా అసమతుల్యత సమస్యను ఎదుర్కోవడానికి డ్రాగన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జననాల సంఖ్య పెరగడం లేదు. 2022లో చైనాలో కేవలం 95.6 లక్షల మంది చిన్నారులు జన్మించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ ప్రచురించిన తాజా నివేదిక తెలిపింది. 1949 నుంచి నమోదవుతున్న రికార్డుల్లో ఇదే అత్యల్ప సంఖ్యగా చెబుతున్నారు. గతేడాది పుట్టిన చిన్నారుల్లో దాదాపు 40 శాతం మంది రెండో సంతానమే. 15 శాతం మంది మూడు లేదా అంతకంటే అధిక సంతానమని తేలింది.
చైనాలో నిరుద్యోగం మహమ్మారిలా మారింది. ఉన్న ఉద్యోగాలకు రక్షణ లేకుండా పోయింది.పెరిగిన ద్రవ్యోల్బణం జన జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. దీంతో కొత్తగా పెళ్లయిన మెజారిటీ జంటలు కేవలం ఒకరిని కంటే చాలనే నిర్ణయానికి వచ్చాయి. కొందరు అసలు పిల్లలే వద్దని అనుకుంటున్నారు. ఫలితంగా గతేడాది చైనా జనాభా 1.41 బిలియన్ల వద్దే ఆగిపోయింది. గత ఆరు దశాబ్దాల్లో చైనా ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. దాంతో ప్రపంచంలోనే ధనిక దేశం కాక ముందే, వృద్ధ దేశంగా మారుతోందని డ్రాగన్లో కలవరం మొదలైంది. వృద్ధ జనాభా పెరగడంతో ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఆదాయం తగ్గిపోతోంది. ఈ పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇక చైనాలో యువత పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. కాలేజీల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు.. ఉద్యోగ కొరతతో సతమతమవుతున్నారు. ఉద్యోగాలు లేక చిన్న,చితక పనులు చేయలేక తల్లడిల్లుతున్నారు. దీన్ని అధిగమించేందుకు చైనా సర్కార్ చేపడుతున్న చర్యలు ఫలించడం లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు.. తమ సమస్యలను సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. సర్కార్ మాత్రం గ్రామసీమల్లో ఉపాధి వెతుక్కోమని చెబుతోంది. దీంతో ఈ సమస్యకు తగిన పరిష్కారం కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లనే మాటకు చాలా మంది యువత దూరంగా జరుగుతున్నట్లు సమాచారం.
చైనాలో జనాభా సమస్యకు అసలు కారణం ‘ఒకే బిడ్డ విధానం’తో మొదలైంది. 1980 నుంచి 2015 దాకా ఆ దేశంలో పెళ్లయిన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేసింది. జనాభా అసమతుల్యత ప్రభావం గురించి తెలియగానే ఆ విధానానికి స్వస్తి పలికింది. జనాభా రేటును పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కొత్తగా పిల్లలను కనేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించింది. అయినా ప్రస్తుతానికైతే పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.













