యెడ్యూరప్ప వెంటే కమలం…..?
కర్నాటకలో కమలం పార్టీకి ఊపిరాడడం లేదు. ఓవైపు కాంగ్రెస్ లో సీఎంగా జనాకర్షక నేత సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. మరోవైపు.. డిప్యూటీ సీఎంగా గండరగండడు డికె శివకుమార్ జతగా నడుస్తున్నారు. ఈపరిస్థితుల్లో ఏం చేయాలన్న కష్టంగానే ఉంది. ఎందుకంటే 2019లో డికె శివకుమార్ ను.. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఈడీ.. తిహార్ జైలుకు పంపింది. ఇలాంటి వాటికి బెదిరేది లేదని అప్పుడే శివకుమార్ కౌంటరిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో సిద్ధరామయ్య, డికె జోడీ… కర్నాటకలో బీజేపీని మడతపెట్టేసింది. సిద్ధరామయ్య చరిష్మా, డికె వ్యూహాలకు బీజేపీ ఖంగుతింది. ఇప్పుడీ జోడీని ఎదుర్కొని బీజేపీని నిలబెట్టడమెలా అన్న చర్చల్లో మోడీ టీమ్ తలమునకలవుతోంది.
బీజేపీ పరిస్థితి చూస్తే .. కర్నాటకలో పార్టీ నిలబడుతుందా అన్నట్లుంది. గేటు తెరిస్తే చాలు కాంగ్రెస్ లోకి జంపయ్యేందుకు రాష్ట్ర కమలనాథులు క్యూ కడుతున్నారు. వీరిని నిలువరించడమెలాగో .. పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఉదయం, సాయంత్రం ఎప్పుడు ఏనేత, ఎవరిని కలుస్తున్నారో అర్థం కావడంలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీని ఒడ్డెక్కించే నాథుడి కోసం ఎదురుచూసిన హైకమాండ్.. చివరకు యడ్యూరప్పనే ఆశ్రయించింది. గతంలో అతన్ని పక్కనపెట్టి, కొడుకును సైతం పట్టించుకోని హైకమాండ్… ఇప్పుడు నేరుగా పిలిచిపిల్లనిచ్చినట్లుగా కొడుకు విజయేంద్రకు.. రాష్ట్ర అధ్యక్షుడిగా పట్టం గట్టింది.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర తన ఎజెండా ఏమిటో వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడమే తన ముందున్న ఎజెండా అని తెలిపారు.పేరుకు విజయేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనా చక్రం తిప్పేది యడ్యూరప్పే. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి పెట్టాల్సిన బాధ్యత యడ్యూరప్పకు అప్పగించినట్లైంది. ఇప్పటికే యడ్యూరప్ప.. ఓవైపు జేడీఎస్ తో చర్చలు జరుపుతూ వస్తున్నారు. వీరిద్దరూ కలిసి, పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పార్టీని గట్టెక్కించే లీడర్లు దూరమయ్యారు. హైకమాండ్ ఒంటెద్దుపోకడలు, పార్టీలో అంతర్గత రాజకీయాలు.. కర్నాటకలో కమలాన్ని అత్యంత బలహీనం చేశాయి. దీంతో మళ్లీ యడ్యూరప్ప గతంలోలా పార్టీని నడిపించగలరా..? అన్నివర్గాలను ఏకతాటిపైకి తేగలరా..? యడ్యూరప్పకు వయసు సహకరిస్తుందా..? విజయేంద్రను లింగాయతులు అక్కున చేర్చుకుంటారా..? ఇవన్నీ బీజేపీ నేతలను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నలు.













