కమలం పిలుస్తోంది..
ఇండియా కూటమికి పెను సంక్షోభం ఎదురైంది. సంక్షోభం అనడం కన్నా బీటలు వారుతుంది అనొచ్చు. ఓవైపు బీజేపీ నుంచి ఆఫర్స్, మరోవైపు కాంగ్రెస్ వ్యవహారశైలి నచ్చని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్.. మహాఘట్భందన్తో తెగతెంపులు చేసుకునే దిశగా ప్రయాణిస్తున్నారు. కూటమిలోని ఆర్జేడీతో కటిఫ్ చేసుకుని.. బీజేపీ మద్ధతుతో సీఎంగా కొనసాగేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.దీంతో నేడో, రేపో నితీష్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కొద్దికాలంగా కూటమి భాగస్వామి అయిన ఆర్జేడీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు నితీష్ కుమార్. దీంతో సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ పార్టీకి దూరంగా జరగాలనే తుది నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనువంశిక పాలనపై నితీష్ కుమార్ గురువారంనాడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన వరుస ట్వీట్లు ఆయనకు ఆగ్రహం కలిగించినట్టు చెబుతున్నారు. ఆ వెనువెంటనే ఢిల్లీలో ఒకటి, పాట్నాలో మరొకటి కీలక సమావేశాలు జరిగాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సారథ్యంలో ఢిల్లీలో మొదటి సమావేశం జరుగగా, పాట్నాలో నితీష్ కుమార్ ఆధ్యక్షతన రెండో సమావేశం జరిగింది. కాగా, ఇప్పటికే నితీష్ తమతో కలిసి వస్తామంటే ఆలోచిస్తామని అమిత్‌షాతో పాటు, రాష్ట్ర బీజేపీ నేతలు సంకేతాలిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయనే కొన్ని అంచనాలు కూడా నితీష్‌ను ఆలోచింప చేసి ఉండవచ్చని అంటున్నారు. ప్రధాని కావాలన్న ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించకపోవడం, సీఎం పదవిని వదులుకోవడం ఇష్టం లేకపోవడం వంటివి కూడా కమలనాథుల వైపు నితీష్ మొగ్గుచూపేందుకు కారణాలు కావచ్చని చెబుతున్నారు.
మరోవైపు నితీష్‌కుమార్‌ను చల్లబరిచేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. చిన్నచిన్న విబేధాలు కామన్ అంటున్న ఆర్జేడీ నేతలు.. అవి నెమ్మదిగా చల్లబడతాయంటున్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే, మాత్రం .. ఇది కూటమి చీలికదిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ.. ఎలాగైనా నితీష్‌ను తమదరికి చేర్చుకుని.. ఇండియా కూటమిని చావు దెబ్బకొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.













