‘శతక’ విజయం..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వంద పతకాలు సాధించారు. మహిళల కబడ్డీలో భారత జట్టు స్వర్ణం గెలుచుకోవడం ద్వారా ఈ మార్కు అందుకుంది. ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు చైనీస్ జట్టును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 26-25తో గెలిచింది. వంద పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలున్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది
దాదాపుగా అన్ని విభాగాల్లోనూ జట్టుకు పతకాలు సాధించారు భారత క్రీడాకారులు ఆర్చరీ, క్రికెట్, కబడ్డీ, జావెలిన్ త్రో, షూటింగ్, ఈక్వెస్ట్రియన్, టెన్నిస్, స్క్వాష్, అథ్లెట్స్.. ఇలా ప్రతీరంగంలోనూ తమదైన ముద్ర వేశారు. దీంతో భారత్ ఆసియా క్రీడల్లో తొలిసారి వంద పతకాలు సాధించింది. ఆసియన్ చాంపియన్ షిప్ లో సగర్వంగా మువన్నెల జెండా రెపరెపలాడింది. చైనా, జపాన్, కొరియా తర్వాత నాలుగోస్థానంలో ఇండియా నిలిచింది. ఖేలో ఇండియా సహా భారత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు.
ఆసియన్ గేమ్స్ లో 100 పతకాలు అందించిన క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. భారత క్రీడాకారులను అభినందించిన మోడీ… వారి ప్రదర్శన విస్మయం కలిగించిందని అన్నారు.10వ తేదీన భారత్కు 100 పతకాలు అందించిన క్రీడాకారులను కలవడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘‘ఆసియా క్రీడల్లో భారత్కు ఇది అద్భుత విజయం. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అని ట్వీట్ లో మోడీ తెలిపారు.
మరోవైపు ఆసియన్ గేమ్స్ లో తొలిసారిగా వందపతకాలు సాధించిన క్రీడాకారులపై… ప్రశంసల జల్లు కురుస్తోంది.క్రీడాశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్, సీడీఎస్ చౌహాన్ సహా పలువురు ప్రముఖులు.. క్రీడాకారుల ప్రతిభను ప్రశంసించారు. దేశఖ్యాతిని ఎలుగెత్తి చాటారన్నారు. ఇక పతకాలు సాధించిన క్రీడాకారుల స్వగ్రామాల్లో ఆనందకర వాతావరణం కనిపిస్తోంది. తమ కుటుంబసభ్యులు పతకం సాధించడంతో.. ఆయా కుటుంబాలు ఆనందంలో మునిగితేలుతున్నాయి.













