షిండే వర్గం మళ్లీ ఉద్ధవ్ గూటికి రానుందా..?
మహారాష్ట్రలో రాజకీయం రంజుగా సాగుతోంది. అక్కడ పార్టీలను చీల్చడమే పనిగా పెట్టుకుంది బీజేపీ. దీంతో అన్ని పార్టీలూ వణికిపోతున్నాయి. గతంలో శివసేనను చీల్చి షిండేను సీఎంను చేసింది. ఇప్పుడు ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎం చేసింది. అయితే ఈ చీలకలు కూడా ఎక్కువకాలం మనలేవు. వాళ్ల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎవరి దారి వాళ్లు చూసుకోవడం కామన్. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్నాళ్లూ షిండేను వాడుకున్న బీజేపీ.. ఇప్పుడు అజిత్ పవార్ తమవైపుకు రాగానే శివసేనను పక్కన పెట్టేసింది. ఇది ఇప్పుడు అగ్గి రాజేస్తోంది.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను చీల్చి ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. మెజారిటీ సభ్యులు తనవైపు రావడంతో అసలు శివసేన తనదేనని ఏక్ నాథ్ షిండే ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఇప్పటికైతే షిండేకే తీర్పు అనుకూలంగా ఉంది. దీంతో తన తండ్రి స్థాపించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రేకు కాకుండా పోయింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఏక్ నాథ్ షిండే తమవైపు రావడంతో అధికారంలోకి రాగలిగింది బీజేపీ. మహారాష్ట్ర కూడా ఇప్పుడు తమదేనని చెప్పుకుంటోంది కమలం పార్టీ. ఎలా అధికారంలోకి వచ్చామనేది కాదు.. వచ్చామా లేదా.. అని మాత్రమే చూడాలంటోంది.
శివసేనను చీల్చినట్టుగానే ఇప్పుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని కూడా చీల్చేసింది. అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంను చేసేసింది. ఎన్సీపీ నుంచి వచ్చిన 9 మందికి మంత్రులుగా అవకాశం కల్పించింది. త్వరలో ఏక్ నాథ్ షిండేను తప్పించి అజిత్ పవార్ ను సీఎంను చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు షిండే తమతో లేకపోయినా సరిపడా మెజార్టీ వచ్చేసింది బీజేపీకి. అజిత్ పవార్ లాంటి సీనియర్ మరాఠా నేత తమవైపు రావడంతో బీజేపీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో అత్యధిక స్థానాలను తాము కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది.
అయితే ఇన్నాళ్లూ తమను పెళ్లి కూతురులా చూసుకున్న బీజేపీ ఇప్పుడు చిన్నచూపు చూస్తోందని ఏక్ నాథ్ షిండే వర్గం అలకపూనింది. తమ అవసరం తీరిపోయిందని బీజేపీ భావిస్తోందని వాళ్లకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్లూ కేబినెట్లో తమకు ఎక్కువ బెర్తులు వస్తాయనుకున్నారు. కానీ ఇప్పుడు అజిత్ పవార్ గ్రూపుకోసం త్యాగం చేయాల్సి వస్తోంది. దీన్ని షిండే వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. తమను బీజేపీ అవసరానికి వాడుకుని వదిలేసిందనే ఆగ్రహంతో ఉంది. అందుకే మళ్లీ ఉద్దవ్ ఠాక్రే చెంతకు చేరేందుకు షిండే వర్గంలోని మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు టాక్ నడుస్తోంది. అదే జరిగితే మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగడం ఖాయం.













