శశికళతో చేతులు కలుపుతున్న పన్నీరుసెల్వం.. అన్నాడీఎంకేలో చీలిక తప్పదా..?
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అక్కడ వార్ జరుగుతూ ఉంటుంది. అయితే జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేకి సారథ్యం వహించేవారు లేకపోవడంతో కుక్కలు చింపిన విస్తరిలాగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. పార్టీని చేజిక్కించుకునేందుకు శశికళ, పన్నీరు సెల్వం, పళనిస్వామి పోటీ పడ్డారు. చివరకు పార్టీ బాధ్యతలు పళనిస్వామికే దక్కాయి. దీంతో పన్నీరు సెల్వం, శశికళ దూరమయ్యారు. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ, పన్నీరు సెల్వం … ఇప్పుడు పార్టీలో బికారులుగా మిగలడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరనేది నానుడి. అది నిజమేనని మరోసారి నిరూపితమైంది. తమిళనాడులో సోమవారం ఇలాంటి దృశ్యమే కనిపించింది. అన్నాడీఎంకేలో ఉన్నన్ని రోజులూ శశికళను, టీటీవీ దినకరన్ ను దూరం పెట్టిన పన్నీరు సెల్వం.. నేరుగా వెళ్లి దినకరన్ తోనే భేటీ అవడం సంచలనం కలిగించింది. అంతేకాక.. అన్నాడీఎంకేను నిజమైన కార్యకర్తలకు చేరువ చేసేందుకు అందరం కలిసి పని చేస్తామని, డీఎంకేనే తమ ప్రధాన శతృవని వెల్లడించారు. త్వరలో తాను శశికళను కూడా కలుస్తానని చెప్పారు. దీంతో శశికళ, పన్నీరు సెల్వం, దినకరన్.. అంతా కలిసి పళనిస్వామి చేతుల్లో ఉన్న అన్నాడీఎంకేను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.
జయలలిత ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి పన్నీరుసెల్వంను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేది. అమ్మ రాగానే ఆ కుర్చీని త్యాగం చేసేసేవారు ఓపీఎస్. దీంతో అమ్మకు అత్యంత సన్నిహితుడిగా పేరొందారాయన. అదే సమయంలో తనకు దక్కాల్సిన కుర్చీని ఓపీఎస్ దక్కించుకుంటున్నాడనే కోపం శశికళలో కనిపించేది. దీంతో వీల్లిద్దరూ బద్ధశతృవులుగా ఉండేవారు. అయితే అమ్మ మరణానంతరం అనూహ్య పరిణామాల మధ్య పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. ఆ తర్వాత పార్టీ పైన కూడా పట్టు సాధించారు. చివరకు శశికళ, దినకరన్, ఓపీఎస్ లాంటి వాళ్లు పార్టీపై హక్కులకోసం ఎంత పోరాడినా ఉపయోగం లేకుండా పోయింది. పళనిస్వామికే పార్టీ చెందుతుందని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో వీళ్లంతా వీధినపడ్డారు.
జయలలితకు పళనిస్వామి కంటే శశికళ, పన్నీరు సెల్వం అత్యంత సన్నిహితులు. కానీ ఇప్పుడు ఆమె పార్టీ వారిద్దరికీ కాకుండా పళనిస్వామి చేతుల్లోకి వెళ్లింది. దీంతో వాళ్లిద్దరూ తట్టుకోలేకపోతున్నారు. దీంతో వీళ్లిద్దరూ ఏకమై పార్టీ లాక్కునేందుకు స్కెచ్ వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. త్వరలోనే వీళ్లంతా కలిసి అన్నాడీఎంకే శ్రేణులను కలసి తమవైపు తిప్పుకునేందుకు ఎత్తులు వేస్తారని సమాచారం. అదే జరిగితే పళనిస్వామి ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి ఆధిపత్యపోరులో అన్నాడీఎంకేలో కూడా చీలిక తప్పదేమో అనిపిస్తోంది.













