ఎన్సీపీలో సంక్షోభం..! బీజేపీ గూటికి అజిత్ పవార్…?
మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అక్కడ శివసేనను చీల్చి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కూలిపోయింది. కాంగ్రెస్ – శివసేన – ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఎంతోకాలం నిలబడలేకపోయింది. అయితే ఇప్పుడు విపక్ష కూటమిలో మరో సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఎన్సీపీ చీలిక దిశగా పయనిస్తోంది. అధినేత శరద్ పవార్ ను కాదని వేరుకుంపటి పెట్టుకునేందుకు అజిత్ పవార్ సిద్ధమవుతున్నారు. దీన్ని శరద్ పవార్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి కలిగిస్తోంది.
ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బీజేపీకి అనుకూలంగా స్టేట్ మెంట్లు ఇవ్వడంతో ఆయన కమలం కూటమిలోకి వెళ్తున్నట్టు అందరూ భావించారు. అయితే ఆ వెంటనే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యారు. తాను బీజేపీతో కలిసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. అయితే ఇంతలోనే ఎన్సీపీలో సంక్షోభం వెలుగులోకి వచ్చింది. శరద్ పవార్ కు ఎన్నికల సమయంలోనే షాక్ ఇచ్చిన సోదరుడు అజిత్ పవార్.. ఇప్పుడు మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎన్నికల ఫలితాలు రాగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అజిత్ పవార్. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. అయితే తాను కాంగ్రెస్ వెంటే ఉన్నానని, అజిత్ పవార్ తో తనకు సంబంధం లేదని చెప్పడం, ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ వైపు నిలవడంతో అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
అయితే ఇప్పుడు అజిత్ పవార్ మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఎన్సీపీని చీల్చేందుకు స్కెచ్ వేశారు. తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ – శివసేన కూటమిలో ఉండడం వల్ల తాము నష్టపోతున్నామని ఎన్సీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వీళ్లంతా అజిత్ పవార్ నేతృత్వంలో వేరుకుంపటి పెట్టుకుని బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. మరోవైపు శరద్ పవార్ కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. 13 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వాళ్లతో మాట్లాడిన ప్రయోజనం ఉండట్లేదని శరద్ పవార్ నిట్టూర్చారు. దీన్నిబట్టి ఎన్సీపీ పరిస్థితి శరద్ పవార్ చేయి దాటిపోయినట్లు అర్థమవుతోంది.
అజిత్ పవార్ వేరుకుంపటి పెట్టుకుంటే ఎన్సీపీ చీలిపోతుంది. అప్పుడు అసలైన ఎన్సీపీ తనదేనని క్లెయిమ్ చేసుకునేందుకు అజిత్ పవార్ కు వీలవుతుంది. అప్పుడు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వడం, ఆ ప్రభుత్వంలో చేరడం ద్వారా లబ్ది పొందొచ్చు. అయితే అలా కాకుండా చీలిక వర్గంతో బీజేపీలో చేరిపోవాలని కమలం పార్టీ నేతలు చెప్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఎన్సీపీ కనుమరుగైనట్టే. అయితే ఇదంతా శరద్ పవార్ – అజిత్ పవార్ మధ్య గ్యాప్ వల్ల జరుగుతోందా.. లేకుండా అన్నదమ్ములిద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ వారంలోనే మహారాష్ట్ర రాజకీయంలో సరికొత్త మార్పులు చూడొచ్చు.













