YS Jagan: జగన్ను ఇరుకున పెట్టిన కాంగ్రెస్..!!
ఉపరాష్ట్రపతి ఎన్నిక (vice president election) దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగ్దీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankar) రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి ఎన్డీయే (NDA) కూటమి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ను తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈయనకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలనూ బీజేపీ (BJP) కోరుతోంది. పోటీ పెట్టవద్దని విపక్షాలకు కూడా విజ్ఞప్తి చేసింది. అయితే అధికార పక్ష విజ్ఞప్తిని విపక్ష కాంగ్రెస్ కూటమి తిరస్కరించింది. ఇండియా కూటమి తరపున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని (Justice B.Sudarshan Reddy) తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది.
ఇండియా కూటమి పోటీ పెట్టకుండా ఉంటే సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. కానీ ఇప్పుడు ఎన్నిక తప్పనిసరి అయింది. దీంతో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలూ ఓటింగ్ లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్, వైసీపీ (YCP) అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అభ్యర్థించారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించినట్లు సమాచారం. మొదటి నుంచి జగన్ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ బీజేపీతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు టీడీపీ కూటమిలో ఉంది బీజేపీ. అయినా వైసీపీ మాత్రం బీజేపీతో సత్సంబంధాలను నెరుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది.
అదే జరిగితే జగన్ మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికార కూటమిలో ఉన్న పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేడర్ కు తప్పుడు సంకేతాలిస్తుంది. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇలా చేయడం ద్వారా వైసీపీకి బీజేపీ దెబ్బకొట్టింది. బీజేపీ తమ ఎంపీలను లాక్కెళ్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది వైసీపీ. ఇలాంటి సమయంలోనైనా బీజేపీని ఎదిరించి నిలబడితే కేడర్ కు, ప్రజలకు ఒక గట్టి సంకేతాన్ని పంపే అవకాశం ఉంటుంది. కానీ అలా జరిగే అవకాశం కనిపించట్లేదు.
అంతేకాక గత ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారని వైసీపీ నేతలు ఇప్పటికే బీజేపీ కూటమిపై విమర్శిస్తున్నారు. మరోవైపు ఈసీ తీరును నిరిసిస్తూ కాంగ్రెస్ ఫైట్ చేస్తోంది. అలాంటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే నైతికంగా లబ్దిపొందే అవకాశం ఉంటుంది. కానీ అధికార బీజేపీపై ఓ వైపు విమర్శలు చేస్తూ మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం వైసీపీకి ఇబ్బందికర పరిణామమే. కానీ ప్రస్తుతం వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.













