ఆందోళన కలిగిస్తున్న గుండెపోట్లు!
ఇటీవల కాలంలో గుండెపోట్లు చాలా ఎక్కువ అయ్యాయి. 40 ఏళ్లు కూడా దాటని ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ చలాకీగా తిరుగుతూ ఉన్న వ్యక్తులు హఠాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. గుండెపోటులకు కారణాలు ఏంటనేది అంత చిక్కడం లేదు.
నందమూరి తారకరత్న నడుస్తూ నడుస్తూ గుండెపోటుకు గురయ్యారు. ఆ తర్వాత చాలామంది గుండెపోటు మరణాల వార్తలను మనం చూసాం. జిమ్ చేస్తూ, నడుస్తూ, కాలేజీలో, డ్రైవింగ్ చేస్తూ.. ఇలా ఎంతోమంది గుండెపోటుతో మృతి చెందారు. తాజాగా టిడిపి నేతలు వరుపుల రాజా, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా గుండెపోటుతోనే చనిపోయారు. వీళ్లంతా 40 ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉన్నవాళ్లే. ఎంతో ఆరోగ్యంగా చివరి క్షణం వరకు కలిసి తిరిగిన వాళ్లే. అయినా ఇలా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
గుండెపోట్లు ఎందుకు సంభవిస్తున్నాయనేది అంతు చిక్కడం లేదు. కరోనా తర్వాత చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కరోనా వచ్చి కోలుకున్న వాళ్లు దీర్ఘకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ కరోనా బారిన పడి చాలామంది శ్వాసకోశ సమస్యలు, నీరసం, కంటి చూపు, గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందని, అందుకే అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా డాక్టర్ను కలిసి చూపించుకోవాలని సలహా ఇస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్ళలో చాలామందికి రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలు ఉన్నాయి. అంతేకాక కరోనా వ్యాక్సిన్ కూడా కొంతమందికి దుష్ప్రభావాలు చూపిస్తోంది. కరోనా కావచ్చు లేదంటే వ్యాక్సిన్ కావచ్చు.. రెండిటిలో ఏది గుండెపోటుకు కారణం అవుతుంది అనేది చెప్పడం కష్టంగా మారింది. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలని సూచిస్తున్నారు.













