సివిల్ కోడ్ వివాదం…
యూనిఫామ్ సివిల్ కోడ్ పై మరోసారి వివాదం ముదురుతోంది. దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమంటూ మోడీ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. మణిపూర్ తగులబడుతుంటే, అక్కడ మంటలను ఆర్పకుండా..మరో వివాదాన్ని రగులుస్తున్నారని మండిపడుతున్నాయి. మోడీవి ఓటుబ్యాంకు పాలిటిక్స్ అని విపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. మోడీ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ముందుగా హిందువులకే వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. SC, STలతో సహా దేశంలోని ప్రతీ ఒక్కరు దేవాలయాల్లో పూజలు చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు స్టాలిన్. దమ్ముంటే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను పంజాబ్‌లో అమలు చేయాలని సవాల్ విసిరారు MIM అధినేత అసదుద్దీన్. ముస్లీం విధానాలన్నీ చట్ట వ్యతిరేకమైనవిగా మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. మణిపూర్ తగలబడుతుంటే అక్కడికి వెళ్లని మోడీ, యునిఫామ్ సివిల్ కోడ్‌పై మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు అసద్.
అయితే మోడీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారని అందుకే..మధ్యప్రదేశ్ ఎన్నికలముందు యూసీసీ గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పెరిగిన ధరలు, మణిపూర్ మంటల గురించి మాట్లాడకుండా ట్రిపుల్ తలాక్,యూసీసీ గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.













