మరాఠా హైడ్రామా
ఎన్సీపీలో చీలిక తర్వాత డిప్యూటీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్.. పార్టీలో బాంబు పేల్చారు. తమదే అసలైన ఎన్సీపీ అని ప్రకటించడంతో .. సంక్షోభం కొనసాగుతోంది.ఎన్సీపీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని, తమదే నిజమైన ఎన్సీపీ అని తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు మరోవైపు అసెంబ్లీ నేతగా అజిత్ పవార్ ను తామంతా ఎన్నుకున్నామని. ఇదే విషయాన్ని స్పీకర్ కు తెలిపామని ప్రఫుల్ పటేల్ తెలిపారు.
పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ క్రమశిక్షణా చర్యలకు దిగారు. ముగ్గురు నేతలను పార్టీ నుంచి తొలగించారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన అజిత్ పవార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఈ ముగ్గురు నేతలు హాజరైనందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. రహస్య ఫిరాయింపులకు వ్యూహరచన చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా ఎన్సీపీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ టట్కరేలను పార్టీ నుంచి తొలగించారు. అనర్హత చర్యలు తీసుకోనున్నట్టు తెలియజేస్తూ అజిత్ పవార్, ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 9 మంది పార్టీ ఎంపీలకు లేఖ పంపారు. పార్టీ బహిష్కరణ వేటుపడిన వారిలో ముంబై డివిజన్ ఎన్సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర మంత్రి శివజీరావ్ గరజే ఉన్నారు.
పార్టీని పునర్నిర్మిస్తామని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తిరుగుబాటు కుట్రలను వివరించేందుకు జనంలోకి వెళ్లారు. పార్టీ చీలిక కుట్ర అంతా ప్రధాని మోడీ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. వెళ్లినవారంతా అవినీతి పరులు కావడంతో.. ఈప్రక్రియ సునాయాసంగా జరిగిందన్నారు. వీరిని గతంలో అత్యంత అవినీతి పరులన్న ప్రధాని మోడీ… వారిని ప్రభుత్వంలో చేర్చుకోవడం ద్వారా మంచే జరిగిందన్నారు. మరోవైపు.. అధికారం యావతో అజిత్ పవార్ తప్పు చేశారన్నారు శరద్ పవార్.. తప్పు చేసినవారిని రాజ్యాంగ బద్దంగా శిక్షిస్తామన్నారు. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.
అసెంబ్లీలో విపక్ష నేతగా అజిత్ పవార్ స్థానంలో జితేంద్ర అవ్హాడ్‌ను శరద్ పవార్ ప్రకటించారు. జితేంద్ర అవ్హాడ్‌ను విపక్ష నేతగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. విపక్ష ఐక్యతకు ఇది విఘాతమని తెలిపింది. అయితే, పవార్ ఈ విషయాన్ని ఖాతరు చేయకుండా ఎన్సీపీ పునర్మిరాణం తక్షణ అవసరమని చెబుతూ మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లారు.అంతేకాదు..తమదే అసలైన ఎన్సీపీ అంటూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ప్రతిగా, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్‌ను తొలగిస్తున్నట్టు అజిత్ వర్గం ప్రకటించింది. జయంత్ పాటిల్‌కు బదులుగా టట్కరేను పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రఫుట్ పటేల్ ప్రకటించారు.













