భూకంప విషాదం..
భూకంప విషాదంతో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలమైంది. రిక్టార్ స్కేలుపై భూకంపతీవ్రత 6.3గా నమోదైంది. భూకంపం వల్ల అనేక మంది మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు అథారిటీ తెలిపింది. భూకంపం వల్ల హెరాత్‌లో మరణించిన వారి సంఖ్య అధికంగా నమోదైందని దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రేయాన్ తెలిపారు. భూకంపం తీవ్రతలో దాదాపు ఆరు గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద సమాధి అయ్యారని చెప్పారు. అలాగే 465 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 135 ఇళ్లు దెబ్బతిన్నాయని యూఎన్ ఆఫీస్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ తెలిపింది.
హెరాత్ ప్రావిన్స్‌లోని జెండా జాన్ జిల్లాలోని పలు ప్రాంతాలు భూకంపం ప్రకంపనల తీవ్రతతో దెబ్బ తిన్నాయని విపత్తు అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్లా జాన్ తెలిపారు. హెరాత్ నగరానికి వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని తర్వాత మూడు అత్యంత బలమైన భూప్రకంపనలు …6.3, 5.9, 5.5 తీవ్రతతో వచ్చాయని తెలిపింది. మధ్యాహ్న సమయంలో కనీసం ఐదు బలమైన ప్రకంపనలు సంభవించాయని హెరాత్ సిటీ అధికారులు తెలిపారు.
భూకంపంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి ఆఫ్ఘనిస్తాన్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ 12 అంబులెన్స్ కార్లను పంపింది. భూకంపం కారణంగా హెరాత్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఆఫ్ఘన్ ప్రావిన్సులైన ఫరా, బద్గీస్లో కూడా భూకంపం సంభవించింది. బరాదర్, హెరాత్, బాద్గీలలో మరణించిన వారికి తాలిబన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్ ఘనీ తన సంతాపాన్ని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని తాలిబాన్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు సూచించింది. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు భద్రతా సంస్థలు తమ వనరులను, సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరింది.
మహా విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల వేదన అంతా ఇంతా కాదు. తమ వారు కనిపించక.. వారికోసం ఎదురుచూపులు చూస్తున్నారు. మరోవైపు ఈప్రమాదంలో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు చురుగ్గా సాగనిపక్షంలో అంటువ్యాదులు ప్రబలే పరిస్థితి ఉందని సమాచారం.













