ఇండియా కూటమికి ఆప్ గుడ్ బై చెప్పడం ఖాయమా…?
కేంద్రంలో బీజేపీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దింపాలనే లక్ష్యంతో విపక్షాలన్నీ కలసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇటీవలే ఇండియా పేరుతో ఓ కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. రెండు విడతలుగా సమావేశమై యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ద్వేషమా.. ప్రేమా.. అనే ప్రశ్నతో విపక్ష కూటమి ప్రజల ముందుకు వెళ్తోంది. కలసికట్టుగా పోరాడితే బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాదని నేతలు లెక్కలేసుకుంటున్నారు. అయితే విపక్ష కూటమిపై అనేక అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియా కూటమిలో ఆప్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేత అల్కా లాంబా వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ మేరకు దిశానిర్దేశం చేశారని.. పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అందులో భాగంగా ఢిల్లీ కూడా చర్చల్లోకి వచ్చింది. అక్కడ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని ముఖ్య నేతలు సూచించినట్టు అల్కా లాంబా తెలిపారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఒకవేళ ఢిల్లీలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగితే విపక్ష కూటమి- ఇండియాకు అర్థమే ఉండదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ విధానం అదే అయితే తాము కూటమిలో ఉండాలా.. లేదా అనే దానిపై ఆలోచించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాక తదుపరి జైపూర్ లో జరగనున్న సమావేశానికి వెళ్లాలా వద్దా అనేదానిపైన కూడా పునస్సమీక్షించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మేల్కొంది. ఆల్కా లాంబా మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది.
అయితే ఇండియా కూటమిలో పలు పార్టీల మధ్య ఇదే సమస్య తలెస్తే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. అలాంటి చోట ఎలా ముందుకెళ్తారనేది పెద్ద సమస్యగా మారింది. గత ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ విజయం సాధించగా కాంగ్రెస్ రెండో స్థానం దక్కించుకుంది. ఇప్పుడీ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇలాంటిప్పడు ఎలా పొత్తు పెట్టుకుంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. ఒకవేళ పలు రాష్ట్రాల్లో పొత్తులు కుదరకపోతే కూటమికే బీటలు వారే ప్రమాదం ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి కూటమిలోని పార్టీలు ఎలా బయటపడతాయో వేచి చూడాలి.













