DUBAI: ఎడారిదేశంలో మంచుతుఫాన్..!
సౌదీ అరేబియాకు ఏమైంది..? ప్రకృతి గతి తప్పిందా..? ఇటీవలి కాలంలో ఎదురవుతున్న పరిస్థితులు ఈ ప్రశ్నలకు కారణమవుతున్నాయి. భరించలేని వేడి, పొడివాతావరణం, ఇసుక తిన్నెలు.. ఇలా సౌదీ అరేబియాలో ఎడారి ఎక్కువభాగమే కనిపిస్తుంది. అలాంటి ఈ దేశాన్ని అనూహ్యంగా మంచు దుప్పటి కప్పేసింది (Snowfall in the desert). తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వెలుగుచూస్తోన్న ఈ వాతావరణ మార్పులు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో భయాన్ని పుట్టిస్తున్నాయి.
సౌదీ అరేబియా (Saudi Arabia)లోని ఉత్తర, మధ్య ప్రాంతంలో ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తబుక్ ప్రావిన్స్‌లోని పర్వత శ్రేణులు ఎప్పుడూ లేనివిధంగా మంచుతో అలరిస్తున్నాయి. అక్కడ 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనాపై మంచుతో పాటు వర్షం పడింది. హెయిల్ ప్రాంతంలోనూ అదే పరిస్థితి కనిపించింది. అలాగే చలిగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పరిస్థితులపై సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. రాజధాని నగరం రియాద్ ఉత్తరం వైపున విస్తరించిన ఎత్తైన ప్రదేశాల్లో హిమపాతం కురిసినట్లు వెల్లడించింది. మేఘాలతో చల్లనిగాలులు సంఘర్షణ చెందడం వల్ల ఇలాంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది. వరదలు సంభవించే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని హెచ్చరించింది. ఆన్లైన్లో క్లాసులు చెప్పాలని రియాద్‌లోని పాఠశాల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అసాధారణంగా కురుస్తోన్న వర్షాలు, దక్షిణాసియాలో వేడిగాలులు, యూఏఈలో ఆకస్మిక వరదలు, యూరప్, ఉత్తరాఫ్రికాలో హిమపాతం వంటి పరిణామాలకు పర్యావరణ మార్పుల సెగ కారణమవుతోందని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఎలా రూపాంతరం చెందుతుందో ఇవి వెల్లడి చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.






