ఎన్నారైలకు దక్కిన ఓటు హక్కు… గెలుపులో కీలకం కానున్న ఎన్నారైలు
విదేశాల్లో ఉన్న ఎన్నారైలకు భారత ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభించలేదు. ఇటీవల పార్లమెంట్లో ఎన్నారైలకు కూడా ఓటు హక్కును కల్పిస్తూ చేసిన చట్టంతో వారికి ఇప్పుడు ఓటు హక్కు లభించింది. దీనివల్ల వారు ఇప్పుడు పార్టీల గెలుపులో కీలకం కానున్నారు.
భారత ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఓటు వేసే హక్కు ఇంతవరకు ఎన్నారైలకు లేదు. కాకపోతే ప్రచారం మాత్రం చేయవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నారైలకు కూడా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉండాలని భారత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఈ మేరకు సవరణ చేస్తూ ఓ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. త్వరలోనే జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోదీ ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నారని, దీనివెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉండని పరిశీలకులు అంటున్నారు. ఈ బిల్లు విషయంలో ప్రధానమంత్రి ఆలోచించినట్లుగా ప్రత్యర్థిపార్టీలు ఆలోచించలేదేమోనని అంటున్నారు.
ఏ ప్రధానమంత్రి చేయనివిధంగా నరేంద్రమోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడే రాజకీయ పార్టీలు ఆయన పర్యటనల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇందులో ఆయన పర్యటనను చూసి ప్రతిపక్షాలు దేశంలో ఉండేది తక్కువా, బయట తిరిగేది ఎక్కువ… అంటూ విమర్శించారు తప్పితే రాజకీయ కోణంలో ఆ పర్యటనలను చూడలేదు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల సమయంలో అక్కడ ఉన్న ఎన్నారైలతో ముఖాముఖీ సమావేశమయ్యేవారు. వారిలో దేశభక్తిని చాటే ప్రభుత్వంగా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఫోకస్ చేసేవారు. దాంతో చాలామంది ఎన్నారైలను పార్టీవైపు ఆకర్షితులయ్యేలా చేశారు. ఇప్పుడు ఎన్నారైలకు ఓటుహక్కు కల్పించడం ద్వారా ఎక్కువ మేలు జరిగేది ఎవరికి అంటే బిజెపికే అని పరిశీలకులు అంటున్నారు.
ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో ఏకంగా 84 దేశాల్లో పర్యటించారు. వీటికి అయిన మొత్తం ఖర్చు రూ. 1,484 కోట్లు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి విదేశాల్లో తిరిగి రావడం అనవసరమని విపక్షాలు పదేపదే దాడిచేశాయి. కానీ ఆయన వ్యూహం వేరు.. వెళ్లిన ప్రతీచోటా భారత సంతతివారిని, ఎన్నారైలనూ కలవడం మోదీ షెడ్యూల్లో ఓ ముఖ్యాంశం. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు ఆయన సభలకు వచ్చేవారు. తన ఆలోచనలను, ప్రభుత్వ లక్ష్యాలను ఆయన వారితో పంచుకునేవారు. ఇలా వారితో ఓ మానసిక అనుబంధాన్ని ఆయన పెంచుకోగలిగారు. వివిధ దేశాల్లో సగటున కోటీ పది లక్షల మంది ఎన్నారైలు ఉన్నట్లు ఓ అంచనా.మొత్తం 543 నియోజకవర్గాలకూ విభజిస్తే వీరి సంఖ్య- ఒక్కో నియోజకవర్గానికి 21,000 మందిగా తేలుతుంది. ఇది సామాన్యమైన సంఖ్య కాదు. చాలా చోట్ల ఫలితాన్ని ప్రభావితం చేయగలదు.
ఈ ఎన్నారైలంతా వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తే అది బీజేపీకి ఎంత లాభం? అంతేకాదు.. ఈ ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. అది కూడా పార్టీకి లాభిస్తుంది. అందుకే వీళ్ల ఓట్లపై ప్రధాని మోదీ చాలాకాలం క్రితమే కన్నేసినట్లు తెలుస్తోంది.
ప్రాక్సీ ఓటింగ్ (తమ ప్రతినిధి ద్వారా ఓటు వేయించుకొనే) సౌకర్యం ఇన్నేళ్లూ కేవలం రక్షణ సిబ్బందికి మాత్రమే ఉండేది. ఎన్నారైలు ఇన్నాళ్లూ తాము ఓటరుగా రిజిస్టర్ చేయించుకున్న నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉండేది. ఇపుడు వారు తమ తరఫున ఓటు వేసే ప్రతినిధిని నియమించుకోవచ్చు. ఎన్నారైలను విశేషంగా నరేంద్రమోదీ ఆకట్టుకున్నారని, వారి ఓట్లు బీజేపీ అభ్యర్థులకే పడతాయని పార్టీ నేతలంటున్నారు. మొత్తానికి, పోల్ మేనెజ్మెంట్లో దిట్టగా మోడీ-షా లను ఎందుకు అభివర్ణిస్తారో ఇప్పుడు అర్ధమైంది. నియోజకవర్గానికి 21,000 మందిని టార్గెట్ చేసుకుని, వీళ్ళు చేసిన వ్యూహం చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే…ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఎన్నారైలకు గాలం వేసే పనిలో పడ్డాయి. దీనికోసం అమెరికాలోనూ ఇతర చోట్ల ఉన్న తమ పార్టీ శాఖలను అప్రమత్తం చేస్తున్నాయి.
ఎన్నికల్లో సత్తా చూపుతున్న అమెరికా ఎన్నారైలు
అమెరికాలో మనవాళ్ళు వెళ్ళి ఐదారు దశాబ్దాలు దాటుతోంది. తొలుత వెళ్ళిన వాళ్ళు తమ ఉపాధి, తమ నివాసం, తమ జీవనంపైనే ఎక్కువ శ్రద్ధ చూపారు. ఇతర విషయాల జోలికి వాళ్ళు వెళ్ళలేదు. తరువాత అమెరికా వచ్చినవాళ్ళు తొలుత వచ్చినవాళ్ళతో కలిసిపోయారు. జనాభా పెరిగింది. కలిసిమెలిసి చిన్న చిన్న సమావేశాలు, వేడుకలు చేసుకోవడం మొదలెట్టారు. మరికొన్నేళ్ళ తరువాత ఇంకొంతమంది వారితో కలిశారు ఇలా ఇలా పెరిగిన భారతీయ జనాభా నేడు అక్కడ 2.4 మిలియన్‌కు పెరిగింది.
మారిన పరిస్థితులు, యువతరం ఆధిక్యం పెరిగిన నేపథ్యంలో భారతీయులు ప్రాంతీయ పరంగా, కులాలపరంగా, పార్టీల పరంగా చీలిపోయారు. చివరకు అక్కడ అన్నీ పార్టీల ప్రాంతీయశాఖలు కూడా ఏర్పడ్డాయి. జాతీయ పార్టీలతోపాటు, ప్రాంతీయ పార్టీల శాఖలు కూడా అక్కడ ఏర్పడ్డాయి.
అమెరికాలో పెద్దసంఖ్యలో ఉన్న గుజరాతీలు, పంజాబీలు ఉత్తర భారత ఎన్నికల్లో కీలకపాత్ర వహిస్తుంటారు. దక్షిణ భారత ఎన్నికల్లో మలయాళీలు, తెలుగువాళ్ళు కీలకపాత్రను పోషిస్తుంటారు. గుజరాతీయులు వ్యాపారులు కాబట్టి వారికి సహజంగానే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. తమ బిజినెస్ లావాదేవీలకోసం ఈ పార్టీ వస్తే బావుంటుందని వారు అనుకుంటారు. ఇందుకోసం వారు స్వరాష్ట్రానికి వచ్చి కూడా ప్రచారం చేస్తుంటారు. వీరి తరువాత పంజాబీలు కూడా రాజకీయాల్లో కీలకపాత్రను పోషిస్తుంటారు. తమ రాష్ట్రం అభివృద్ధిలో పాలుపంచుకుంటూనే ఎన్నికల్లో కూడా కీలకంగా ఉంటారు. వీరి తరువాత మలయాళీలు, తెలుగువాళ్ళు కూడా ఎన్నికలపై మంచి అవగాహనతో తమవారిని ప్రభావితం చేస్తుంటారు. వీరిలో ఎక్కువమంది కాకపోయినా కొంతమంది మాత్రం రాష్ట్ర రాజకీయాలపై మక్కువ చూపిస్తుంటారు. అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఉవ్విళ్ళూరుతుంటారు.
అమెరికాలో ప్రధాన రాజకీయ పార్టీలకు విభాగాలు కూడా ఉన్నాయి. ఈ విభాగాలు ఆయా పార్టీలకు మద్దతుగా ప్రచారాన్ని, విరాళాలను సేకరిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఆఫ్ బిజెపి యుఎస్ఎ పనిచేస్తుంది. అలాగే ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. మన రాష్ట్రాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నారై టీడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వైఎస్ఆర్సిపి యుఎస్ఎ, టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా టీఆర్ఎస్ యుఎస్ఎ పనిచేస్తోంది.
ఎన్నికల సమయంలో ఈ పార్టీలకు చెందిన ఎన్నారైలు తమ తమ రాష్ట్రాలకు వెళ్ళి, తమ తమ నియోజకవర్గాల్లో తమ పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే సొంత నిధులను కూడా వెచ్చిస్తున్నారు. సొంతమంది ఎన్నారైలు అమెరికా నుంచే తమ బంధుమిత్రులకు ఫోన్ చేసి ఆ పార్టీకి ఓటు వేయమని కోరుతున్నారు. ఈ ప్రచారంతోనే కాకుండా, అమెరికాకు ఆయా పార్టీల అధినేతలను, నాయకులను రప్పించి వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎన్నారైలలో ఆయా పార్టీలకు మద్దతుగా ప్రచారాన్ని కూడా ఈ ఎన్నారై పార్టీల శాఖలకు చెందినవారు చేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీ అభిమానుల పోరు
జాతీయ పార్టీల విభాగాలతో పోల్చుకుంటే ప్రాంతీయ పార్టీల రాజకీయాలు చాలా వేడిగా ఉంటాయి. దానికి తగ్గట్టే అభిమానులు కూడా తమ పార్టీపై మద్దతుగా ప్రచారం, కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అదే సమయంలో పార్టీ నాయకులు వస్తున్నప్పుడూ పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తుంటారు. ఒక్కోసారి రెండు వర్గాలు ఉన్నప్పుడు ఈ పర్యటన సమయాల్లో ఒకరికిఒకరు పోటాపోటీగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. విభేదాలు బయటపడి రోడ్డున పడుతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్థిపార్టీల నాయకులు వస్తున్నప్పుడు ఇతర పార్టీల నాయకులు వస్తున్నప్పుడు నిరసన వంటి కార్యక్రమాలను బహిరంగంగా చేయడం ద్వారా రాజకీయ పార్టీల రచ్చలను వీధికెక్కిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అమెరికా వీధుల్లో కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీకి పెద్దసంఖ్యలో ఇక్కడ అభిమానులు ఉండటం ఓ కారణం. ఎపిలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీకి కూడా అభిమానులు బాగానే ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం ఏర్పడినప్పుడు చిరంజీవి అభిమానులు ప్రజారాజ్యంకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు జనసేన రావడంతో చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేనకు మద్దతుగా ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి.
ముగింపు
మొత్తం మీద చూస్తే ఎన్నారైలకు లభించిన ఓటుహక్కుతో ప్రత్యక్ష రాజకీయాల్లో వారు కీలకమయ్యే అవకాశం లభించింది. ఇన్నాళ్ళు ఎన్నారైల నిధులకోసం వెంటపడే పార్టీలు ఇప్పుడు వారి ఓటును కూడా తమకు వేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో మిగతా పార్టీలకన్నా బిజెపి ముందుంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే ఎన్నారైలలో తమ పట్టును పెంచుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్నారైలు కీలకంకావడంతోపాటు అవసరమైతే ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
– చెన్నూరి వెంకట సుబ్బారావు
(వ్యాసకర్త అమెరికాలో ప్రచురితమయ్యే ‘తెలుగు టైమ్స్’ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు)













