శ్రీధర వెంబు.. గ్రామ సేవకుడికి పద్మశ్రీ
తమిళనాడులోని తన స్వగ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలని తపించిపోయిన అమెరికాలో తన కోట్లాది రూపాయల వృత్తిలో తలమునకలుగా నిమగ్నమై ఉన్నప్పటికీ తన మూలాలను మరచిపోని 54 ఏళ్ల శ్రీధర్ వెంబు ఏవిధంగా చూసినా అద్భుత, అద్వితీయ వ్యక్తి. తన స్వగ్రామం రూపురేఖలు మార్చి గ్రామస్థులకు కొత్త జీవితం ప్రసాదించిన శ్రీధర్ సేవా జీవితం వట్టిపోలేదు. అటు గ్రామస్థుల ప్రేమాదరణలు గెలుచుకున్న శ్రీధర్ ఇటు భారత ప్రభుత్వ గుర్తింపును కూడా పొందారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున ఆయనను ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారంతో ప్రభుత్వం ఎంతో ఘనంగా సత్కరించింది. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ బిరుదుకు ఎంపిక చేసింది. ‘నిరాడంబర జీవితానికి, మహోన్నత ఆలోచనా ధోరణికి’ ప్రతీకగా మన్ననలు పొందిన శ్రీధర్ అమెరికాలో టెక్నాలజీ సంబంధిత వ్యాపారంలో ఎన్నో మైలురాళ్లు దాటి, ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ప్రస్తుతం ఆయనొక సాఫ్ట్వేర్ దిగ్గజం. ఆయన విలువ 2500 కోట్ల డాలర్లు. ప్రపంచంలో అపర భారతీయ కుబేరుల్లో 59వ స్థానంలో ఉన్నారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నుంచి తమిళనాడుకు వచ్చిన ఈ టెక్ కుబేరుడు గ్రామీణ యువతకు సాధికారిత కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. చెన్నైకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలోని తన స్వగ్రామం మాతలం పారైలో స్థిరపడిన శ్రీధర్ కోడి కూయక మునుపే లేచి, తాజా పల్లె గాలిని పీలుస్తూ, గ్రామీణుల నమస్కారాలు అందుకుంటూ తన సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిచ్చెక్కించే జన సందోహానికి దూరంగా ప్రశాంత జీవితం గడుపుతున్న శ్రీధర్ పల్లె ప్రపంచంలో కొత్త వెలుగులు నింపుతున్నారు.
చెన్నై, కాలిఫోర్నియాలు ప్రధాన కేంద్రాలుగా జోహో కార్పొరేషన్‌ను నెలకొల్పి, దానికి సి.ఇ.ఒగా వ్యవహరిస్తున్న శ్రీధర్ ప్రపంచవ్యాప్తంగా ఐ.టి సంస్థలను సమన్వయం చేస్తూ సేవలందిస్తున్నారు. సాలీనా ఆయన సంస్థ ఆదాయం 100 కోట్ల డాలర్ల పైమాటే.
తమిళనాడులోని మాతలంపారై గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన శ్రీధర్ వెంబు ‘బేర్‌ఫుట్ బిలియనైర్’గా ప్రసిద్ధి చెందారు (గ్రామంలో ఉన్నప్పుడు ఆయన పాదరక్షలు ధరించరు). ఆయన న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎం.ఎస్, పిహెచ్.డిలు చేశారు. 1989లో చెన్నైలోని ఐ.ఐ.టిలో గ్రాడ్యుయేషన్ చేశారు. శాన్‌డియాగోలోని క్వాల్కామ్లో ౖవైర్లెస్ ఇంజనీర్‌గా తన ఐ.టి వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో తన ‘అమెరికా కలల’ను పండించుకోవడం ప్రారంభించారు. కొద్ది కాలం తర్వాత ఆయనలో సొంతంగా ఏదైనా చేయాలనే తపన, ముఖ్యంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సేవ చేయాలనే ఆరాటం ప్రారంభమైంది.
ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న శ్రీధర్ వెంబు మొదట కాలిఫోర్నియాలో తన జోహో కార్పొరేషన్‌ను ప్రారంభించారు. 1996 నుంచి 2009 వరకు ఆ సంస్థను అడ్వెంట్నెట్ పేరుతో వ్యవహరించేవాళ్లు. తర్వాత చెన్నైలో అంతర్జాతీయ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్రమంగా దాన్ని శాఖోపశాఖలుగా విస్తరించారు. తన గ్రామంలో కూడా దాని శాఖను ప్రారంభించిన శ్రీధర్ వెంబు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటతో సహా అనేక చిన్న పట్టణాలకు విస్తరించారు. ఆ తర్వాత పట్టణాలు, నగరాల్లోని ఐ.టి కారిడార్లలో కూడా శాఖలను నెలకొల్పారు.
యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, సింగపూర్, జపాన్, చైనా, ఆస్ట్రేలియాలలో కూడా కార్యాలయాలున్న జోహో కార్పొరేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ‘క్లౌడ్’ ఆధారిత బిజినెస్ సొల్యూషన్స్‌ను రూపొందించే ఈ సంస్థ సేవలను ఆమెజాన్, జొమాటో, జియోమి, ఓలా, వర్ట్పూల్, ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు పొందుతున్నాయి.
జోహో కార్పొరేషన్లో సుమారు 7,000 మంది పని చేస్తుండగా అందులో 20 శాతం మంది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. గ్రామీణ యువతీ యువకులకే కాకుండా పట్టణాలు, నగరాల్లోని నిరుద్యోగులకు కూడా శిక్షణనివ్వాలన్న లక్ష్యంతో 16 ఏళ్ల క్రితం ఆయన జోహో స్కూల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ స్కూల్స్‌లో ఆ యువతీ యువకులకు ప్రత్యేక నైపుణ్యాలను బోధిస్తుంటారు. కేవలం పుస్తకాల గ్రేడ్లు, ర్యాంకులు, పుస్తకాల చదువుల మీదే ఆధారపడిన యువతకు ఆచరణాత్మక నైపుణ్యాలు బోధించాలన్నది ఆయన ఆశయం. ఆ దిశగానే జోహో స్కూల్స్ బోధన పద్ధతులు చేపట్టాయి.
12వ తరగతి పూర్తి చేసి, వృత్తి విద్యా కోర్సుల్లో డిప్లొమా ఉన్న 17 నుంచి 20 సంవత్సరాల లోపు వయసున్న యువతీ యువకులకు జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్‌లో వెబ్ డిజైన్, ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్, మార్కెటింగ్ వంటి అంశాలలో ఉచితంగా ప్రత్యేక శిక్షణనిస్తారు. అంతేకాదు, 24 నెలల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో నెలకు 10,000 రూపాయల చొప్పున ప్రతి విద్యార్థికి స్టైపెండ్ చెల్లిస్తారు. అక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా బోధిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి జోహో కార్పొరేషన్లో ఉద్యోగాలిస్తారు.
ఆయన గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే, ఆయన అమెరికాలో పిహెచ్.డి పూర్తి చేసిన తర్వాత కాన్బెరాలోని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగం లభించింది. ఆయన అక్కడ కొద్ది కాలం పనిచేశారు. అయితే, టెక్నాలజీని వృత్తిగా చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్న శ్రీధర్ వెంబు ఆ లెక్చరర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్లే. ”అదేదో చేయాల్సింది. ఇదేదో చేయాల్సింది అని బాధపడుతూ కూర్చోకు. భవిష్యత్తులో నువ్వేం చేయాల్సి ఉందో దాని గురించి ఆలోచించు” అని ఆయన తన విద్యార్థులకు తరచూ చెబుతుంటారు.
తన గ్రామానికి ఏదో ఒక సేవ చేయాలనే తపనతో ఆయన పేద రైతులు, రైతు కూలీల పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతా స్కూళ్లు మూతపడడంతో తన గ్రామంలో ఇళ్లలోనే ఉంటున్న విద్యార్థులకు ఆయన ఉచితంగా చదువు చెబుతుంటారు. మొదట్లో ఏదో అవసరం నిమిత్తం కొద్ది మంది విద్యార్థులు మాత్రమే ఆయన దగ్గర చేరినప్పటికీ, ప్రస్తుతం 100 మందికి పైగా విద్యార్థులు ఆయన దగ్గర చేరి, చదువుకుంటున్నారు.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఈ అపర కుబేరుడు దీని నుంచి స్ఫూర్తిని పొంది, గ్రామీణ పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేసి, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన చదువు చెప్పడమే కాకుండా, ఉచితంగా ఆహారం కూడా సమకూరుస్తున్నారు.













