కళాకారులంతా దేశ ప్రతిష్ఠను విశ్వవ్యాప్తం చేయాలి : ఉపరాష్ట్రపతి
భారత కళాకారులంతా దేశ ప్రతిష్ఠను విశ్వవ్యాప్తం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. చెన్నైలోని యువర్స్ ట్రూలీ మార్గళి ఉత్సవాలను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నాట్యం, సంగీతంతో శాంతి, సహనం, సౌభ్రాతృత్వం పెంపొదించగలమన్నారు. కరోనా సృష్టించిన ఈ కల్లోలంతో కళాకారులు ఎక్కువ ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ సమయంలో ప్రజలకు చేరువయ్యేందుకు వర్చుల్ విధానాలను పాటించాలని సూచించారు. భవిష్యత్తులో వర్చువల్ విధానం ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఆయన తెలిపారు. భారతీయ నృత్య, సంగీత కళలు ప్రకృతితో మమేకం చేస్తూ వ్యక్తిగత వృద్ధికి దోహదపడతాయన్నారు. మన సంస్కృతి, కళలు ప్రపంచానికి మనం ఇచ్చే ఒక బహుమతి అని అన్నారు. ప్రస్తుతం యువతకు అన్ని రకాల సంస్కృతులు, విధానాలు తెలుసుకొనే సామర్థ్యం, అవకాశం ఉందన్నారు. అన్నింటినీ నేర్చుకుంటూనే మన మూలాలను మరిచిపోకూడదని వారికి సూచించారు.
వర్చువల్ విధానంలో జరిగిన ఈ ఉత్సవాల ఆరంభోత్సవాలను అనేక మంది ప్రముఖులు, 500 లకు పైగా కళాకారులు వీక్షించారు. యూవర్స్ ట్రూలీ మార్గళి అనే కార్యక్రమంలో చెన్నై సంగీతం, నృత్యోత్సవాల సంప్రదాయాలను వర్చుల్ విధానంలో కొనసాగిస్తున్నారు. 2020 డిసెంబరు 15 నుంచి 2021 జనవరి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.













