యూఎస్ కు భారత్ బలమైన భాగస్వామి.. స్పష్టంచేసిన అమెరికా రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాకు భారత్ అత్యంత బలమైన భాగస్వామి అని యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య రక్షణ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలూ తీర్మానించుకున్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో శనివారం నాడు లాయిడ్ ఆస్టిన్ భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ మాకు అత్యంత బలమైన భాగస్వామి. భాగస్వాముల మధ్య ఈ తరహా చర్చలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ స్థాపన విషయంలో భారత్ మా మూలస్తంభం. అందుకే ఈ రక్షణ భాగస్వామ్యానికి బైడెన్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ఆస్టిన్ తెలిపారు. అమెరికా తన మిత్ర దేశాల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని చెప్పిన ఆయన.. భారత్‌తో సమగ్రమైన రక్షణ భాగస్వామ్యం కోరుకుంటున్నామని తెలియజేశారు.
చర్చలో రష్యా మిసైల్స్ లేవు!
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి ఆస్టిన్‌తో కచ్చితంగా చర్చ ఉంటుందని, ఇరు దేశాల మధ్య బంధాలను ఈ అంశం ప్రభావితం చేస్తుందని ఈ సమావేశానికి ముందు నిపుణులు ఆందోళన చెందారు. అయితే తమ మధ్య ఈ అంశం అసలు చర్చకే రాలేదని ఆస్టిన్ తెలిపారు. కాగా అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల తొలి క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా చట్టసభల సభ్యులు, పలువురు నిపుణులు మద్దతు ప్రకటించారు.
చైనా ఆగడాలపై చర్చ.. 3 బిలియన్ డాలర్ల రక్షణ డీల్!
రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, చర్చల్లో రక్షణ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, రక్షణ రంగంలో నూతన అంశాల్లో సహకరించుకోవడం, పరస్పర లాజిస్టిక్స్ సహకారం, ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవడంపై ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలిపారు. లద్దాక్ ప్రాంతంలో చైనా ఆగడాలు కూడా చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. రక్షణ సహకారంపై ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మాట్లాడినట్లు తెలియజేశారు. భారత్-అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచిపోతుందని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. కాగా, ఈ సమావేశాల సందర్భంగా అమెరికాతో 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. యూఎస్ నుంచి 30 మల్టీ-మిషన్ ఆర్మ్డ్ ప్రెడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మీడియం-ఆల్టిట్యూడ్ లాండ్ ఎండ్యూరెన్స్ (ఎంఏఎల్‌ఈ) ప్రెడేటర్-బి అని పిలిచే ఈ డ్రోన్లు 35 గంటలపాటు గాల్లో ప్రయాణించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వెంటాడి వేటాడే సామర్థ్యం వీటి సొంతం.













