ఏకంగా కేంద్ర ఐటీ మంత్రికే ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య ‘వార్’ మరింత ముదిరిపోయింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించే విషయంలో కేంద్రంతో ట్విట్టర్ వివాదం ప్రారంభమైంది. సరైన నిబంధనలను పాటించడం లేదని మధ్యవర్తిత్వ హోదాను కూడా కేంద్రం తొలగించింది. తాజాగా ట్విట్టర్ ఏకంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కే ఝలక్ ఇచ్చింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తిగత అకౌంట్‌ను ట్విట్టర్ గంటసేపు నిలిపేసింది. కాపీ రైట్స్ ఉల్లంఘన కింద ఆయన అకౌంట్‌ను బ్యాన్ చేసేసింది. గంట తర్వాత.. పునరుద్ధరించింది. ఈ విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘యూఎస్‌ఏ డీఎంసీఏ చట్టం ఉల్లంఘన కింద నా అకౌంట్‌ను యాక్సిస్ కాకుండా ట్విట్టర్ చేసింది. గంట తర్వాత తిరిగి యాక్సిస్‌కు అనుమతినిచ్చింది. నా ఇంటర్వ్యూల విషయంలో ఏ ఛానల్ కూడా కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదు. కానీ ఫిర్యాదుల వల్లే ఖాతాను నిలిపేశామని ట్విట్టర్ చెబుతోంది.’’ అంటూ కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.