Shivraj Singh Chouhan: అమెరికా డీల్‌తో రైతులకు ఢోకా లేదు: శివరాజ్ సింగ్ చౌహాన్
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, విపక్షాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) స్పష్టత ఇచ్చారు. ఈ ఒప్పందంలో భారత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్‌లోని సేహోర్లో జరిగిన జాతీయ పప్పుధాన్యాల సదస్సులో (National Pulses Summit) ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల హక్కులకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణ కవచం ఏర్పాటు చేశామని భరోసా ఇచ్చారు.
ఒప్పందం పేరుతో ఏదో విపత్తు ముంచుకొస్తుందని, దేశాన్ని అమ్మేశారని విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంలో వాస్తవం లేదని మంత్రి (Shivraj Singh Chouhan) మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతులకు నష్టం కలిగించే ఏ ఒక్క అంశానికి కూడా ఈ డీల్‌లో చోటు ఇవ్వలేదని తేల్చిచెప్పారు. ముఖ్యంగా మన దేశీయ మార్కెట్‌ను దెబ్బతీసే అమెరికా ఉత్పత్తులకు ఇక్కడ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ రక్షిత జాబితాలో గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ వంటి ప్రధాన పంటలు ఉన్నాయని, పాలు, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తులు, పౌల్ట్రీ, ఎథనాల్, ఇంధనం, పొగాకు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయని చౌహాన్ చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని, మన రైతుల పంటలన్నీ సురక్షితంగా ఉన్నాయని కేంద్ర మంత్రి (Shivraj Singh Chouhan) వివరించారు. ఈ ఒప్పందాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా, దీనివల్ల కలిగే లాభాలను కూడా గమనించాలని చౌహాన్ సూచించారు. అమెరికా తగ్గించిన 18 శాతం టారిఫ్‌ల (Tariffs) వల్ల భారతీయ ఉత్పత్తులకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యంగా మన బాస్మతి బియ్యానికి (Basmati Rice) అమెరికాలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయని, గతేడాది రూ. 63,000 కోట్లుగా ఉన్న బాస్మతి ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అలాగే వస్త్ర రంగం విస్తరించడం వల్ల పత్తి రైతులకు, సుగంధ ద్రవ్యాల రైతులకు కూడా ఈ ఒప్పందం ద్వారా మేలు జరుగుతుందని మంత్రి (Shivraj Singh Chouhan) విశ్లేషించారు.













