తొమ్మిదో రౌండూ ‘అసంపూర్ణమే’
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు మళ్లీ అసంపూర్ణంగానే ముగిశాయి. ఇవి తొమ్మిదో విడత చర్చలు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టగా, వెనక్కి తీసుకునే ముచ్చటే లేదని కేంద్రం అదే రీతిలో తెగేసి చెప్పింది. దీంతో తొమ్మిదో విడత చర్చల్లోనూ పీటముడి నెలకొంది. దీంతో పదో విడత చర్చలను ఈ నెల 19 న జరుగుతాయని ఇరు వర్గాల ప్రతినిధులు వెల్లడించారు. చట్టాల్లోని అంశాల వారీగా మాట్లాడుకుందామని కేంద్రం ప్రతిపాదిస్తుంటే… చట్టాల ఉపసంహరణ, కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ… లాంటి అంశాలపైనే రైతులు చర్చకు పట్టుబడుతున్నారు. అయితే రైతులను ఉగ్రవాదులగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, వారిపై కక్షసాధింపు చర్యలకు కేంద్రం దిగుతుండటంపై రైతులు ఈ సమావేశ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
120% చర్చలు ఫెయిల్ : రైతు నేత
కేంద్ర ప్రభుత్వంతో జరిగిన తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం ఫెయిల్ అయ్యాయని రైతు సంఘం నేత దర్శన్ పాల్ పేర్కొన్నారు. తాము ఒకటి ప్రతిపాదిస్తే, కేంద్రం మరో విషయం ప్రతిపాదిస్తూ మొండిగా ఉంటోందని మండిపడ్డారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు.
రాహుల్ పై తీవ్రంగా మండిపడ్డ తోమర్
రైతులతో చర్చలు ముగిసిన తర్వాత కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ ప్రకటనలు, చర్యలు చూసి ఆ పార్టీ వారే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ 2019 లోనే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఈ విషయాన్ని తాము గుర్తు చేస్తున్నామని చురకలంటించారు. ఆ మేనిఫెస్టోను రాహుల్ ఓ సారి చూసుకుంటే బాగుటుందని తోమర్ ఎద్దేవా చేశారు. ఇక చర్చలపై మాట్లాడుతూ… ‘‘చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనేందుకే తాము మొగ్గు చూపుతున్నాం. చలి గాలుల్లో రైతులు ఆందోళన చేస్తుంటే తాము ఆందోళన చెందుతున్నాం. సుప్రీం ఎప్పుడు పిలిస్తే మేం అప్పుడు వెళ్తాం. మా వాదనలను వినిపిస్తాం.’’ అని తోమర్ ప్రకటించారు.













