నామినేషన్ వేసిన వెంటనే అలాంటి పని చేసిన తమిళసై..
తమిళసై సౌందరాజన్ తెలంగాణ గవర్నర్ గా తన పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ ఆమెకు సౌత్ చెన్నై నుంచి ఎంపీ టికెట్ కేటాయించింది. తమిళనాడులో మొదట విడతలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తమిళిసై కూడా ఈరోజు తన నామినేషన్ ను వేశారు. నామినేషన్ వేసి తమిళసై బయటకు వస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు తన నామినేషన్ దాఖలు చేయడానికి ఆమె సమీప ప్రత్యర్థి డీఎంకే మహిళా నేత తమిజాచి తంగపాండియన్ కూడా అప్పుడే రావడం.. ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురు పడడం జరిగింది. మామూలుగా ప్రత్యర్థులు ఎదురుపడితే ముఖాలు ముడుచుకొని పక్కకు వెళ్తారు. అయితే ఈ ఇద్దరు మాత్రం దానికి భిన్నంగా నవ్వుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. ఇది చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారి షాక్ కి గురయ్యారు. తమిళనాడు లో డీఎంకే, బీజేపీ మధ్య పోటీ ఎంతో తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో ప్రత్యర్థులు అంతా ఆప్యాయంగా పలకరించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.













