టికెట్ ఇవ్వలేదని పురుగుల మందు తాగిన ఎంపీ
ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. అలాగే అభ్యర్థులకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం కూడా సహజం. ఇక టికెట్ దక్కిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటే.. దక్కని అభ్యర్థులు బాధపడతారు లేదా పార్టీ జంప్ అయి అక్కడ టికెట్ సంపాదించుకుంటారు. అయితే తమిళనాడులోని ఓ ఎంపీ మాత్రం ఆశ్చర్యకరంగా తన ప్రాణాలే తీసుకోవడానికి ప్రయత్నించాడు. తమిళనాడుకు రాష్ట్రం ఈరోడ్ నియోజకవర్గానికి చెందిన ఎండీఎంకే పార్టీ నుంచి గణేశ మూర్తి(74) ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి పార్టీ నిరాకరించింది. దీంతో బాధపడడం లేదా కొంతమంది నాయకుల్లా పార్టీలు మారకుండా ఏకంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలా టికెట్ దక్కలేదని ఓ నేత ఆత్మహత్యాయత్నం చేయడం దేశంలోనే ఇది తొలిసారి.
దేశంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులోని పలు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఆ పొత్తుల్లో భాగంగా అధికారంలో ఉన్న డీఎంకేతో ఎండీఎంకే చేతులు కలిపి కొన్ని సీట్లను అధికార పార్టీకి ఇచ్చేశారు. ఇందులో ఈరోడ్‌కి డీఎంకే నుంచి ప్రకాశ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ కు ఈరోడ్ టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన గణేశ మూర్తి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక.. పార్టీ వదిలి వెళ్ళలేక గణేష్ చాలా బాధ పడ్డారు. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి 10 గంటలకు ఆయన పురుగుల మందు తాగారని కుటుంబ సభ్యులు చెప్పారు. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
కుటుంబసభ్యుల వివరణ ప్రకారం.. టికెట్ నిరాకరణ వల్ల ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. 40 ఏళ్లకుపైనే రాజకీయాల్లో ఉన్న ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడటంపై అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2009, 2019లో రెండు సార్లు గణేశ మూర్తి ఈరోడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా కూడా సేవలందించారు.













