ఆ ఘనత ప్రధాని మోదీ ప్రభుత్వానిదే : ప్రహ్లాద్ జోషీ
దేశంలో 200 కోట్లకు పైగా కొవిడ్ టీకాలు డోసులు పంపిణీ చేసిన ఘనత ప్రధాని నరంద్ర మోదీ ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో ప్రారంభించి ఇప్పుడు రూ.లక్షా 20వేల కోట్లకు మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకం కింద ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని పేర్కొన్నారు.
కరోనాను నియంత్రించడంలో, ఆర్థికంగా పుంజుకోవడంలో దేశం ముందంజలో ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీకి దేశమంతా ఓ కుటుంబమన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. పాతబస్తీలో మెట్రో ప్రారంభించడానికి రాష్ట్రం వ్యతిరేక విధానం అనుసరిస్తోందని విమర్శించారు. రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతిని కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారు? అని నిలదీశారు. ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు.













