వరల్డ్ కప్‌ను ఘనంగా ఆరంభించిన సౌతాఫ్రికా.. లంకపై భారీ విజయం
వరల్డ్ కప్ 2023లో తమ తొలి మ్యాచులోనే సౌతాఫ్రికా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఏకంగా 428/5 స్కోరు చేసింది. వరల్డ్ కప్‌లో అత్యధిక టీం టోటల్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచులో ముగ్గురు సౌతాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డీ కాక్ (100), రాసీ వాన్ డర్ డస్సెన్ (108), ఎయిడెన్ మార్క్రమ్ (106) శతకాలతో చెలరేగారు. మిగతా వారు కూడా ఫర్వాలేదనిపించారు. ఈ భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంకకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు పాథుమ్ నిస్సంక (0), కుశాల్ పెరీరా (8) విఫలమయ్యారు. కుశాల్ మెండిస్ (76), చరిత్ ఆశలంక (79), దాసున్ షనక (68) అర్ధశతకాలతో రాణించారు. కానీ మిగతా బ్యాటర్లు అనుకున్న స్థాయిలో ఆడలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లతో చెలరేగాడు. కగిసో రబాడ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ తలో రెండు వికెట్లతో రాణించగా.. లుంగి ఎన్గిడీ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో 102 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. మెగాటోర్నీని ఘనంగా ఆరంభించింది. బ్యాటుతో విధ్వంసం సృష్టించిన ఎయిడెన్ మార్క్రమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













