సౌతాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం
వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఏకంగా 220 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచుల తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు అదరగొట్టారు. హెన్రిక్ క్లాసెన్ (109), రీజా హెండ్రిక్స్ (85), రాసీ వాన్ డర్ డస్సెన్ (60), ఎయిడెన్ మార్క్రమ్ (42), మార్కో యాన్సెన్ (75 నాటౌట్) చెలరేగారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గస్ అట్కిన్సన్, అదిల రషీద్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఛేజింగ్‌లో ఇంగ్లండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. టాప్ బ్యాటర్లు ఎవరూ కనీసం 20 పరుగుల మార్క్ దాటలేదు. చివర్వో గస్ అట్కిన్సన్ (35), మార్క్ వుడ్ (17 బంతుల్లో 43 నాటౌట్) ధనాధన్ షాట్లు ఆడారు. కానీ అప్పటికే ఆ జట్టు ఓటమి అంచున నిలిచింది. దీంతో ఇంగ్లండ్ 22 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లతో రాణించాడు. మార్కో యాన్సెన్, లుంగి ఎన్గిడీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అద్భుతమైన శతకంతో సౌతాఫ్రికాకు భారీ స్కోరు అందించిన క్లాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













