చెలరేగిన సౌతాఫ్రికా.. 149 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు
ఈ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. తాజాగా వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్‌ను కూడా ఏకంగా 149 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. క్వింటన్ డీ కాక్ (174), ఎయిడెన్ మార్క్రమ్ (60), హెన్రిక్ క్లాసెన్ (90), చివర్లో డేవిడ్ మిల్లర్ (34 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మహ్మదుల్లా (111), లిటాన్ దాస్ (22) మాత్రమే కనీసం 20 పరుగుల మార్కు దాటారు. మిగతా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లతో మెరిశాడు. మార్కో యాన్సెన్, కగిసో రబాడ, అరంగేట్ర ఆటగాడు లిజాడ్ విలియమ్స్ తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. దీంతో సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో న్యూజిల్యాండ్‌ను వెనక్కు నెట్టిన సఫారీలు.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకున్నారు. భారీ సెంచరీతో సౌతాఫ్రికాకు అద్భుతమైన స్కోరు అందించిన క్వింటన్ డీ కాక్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













