రాజ్యసభకు సోనియా.. బరేలీకి ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత, రాయ్‌బరేలీ ఎంపీ సోనియా గాంధీ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకునే అవకాశాలు కలిపిస్తున్నాయి. ఆ బాధ్యతలను కూతురు ప్రియాంకా గాంధీ వాద్రాకు అప్పగిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 77 ఏళ్ల సోనియా గాంధీ రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి లేదా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న 56 సీట్లకు జరిగే రాజ్యసభ ఎన్నికలకు గాను నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఈ నెల 15. దీంతో ఒకట్రెండు రోజుల్లోనే సోనియా గాంధీ అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. అదే సమయంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రాను దశాబ్దాలుగా కుటుంబానికి కోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దించనున్నారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక బరిలో తొలిసారిగా నిలవనున్నారు.













