గవర్నర్ చేసిన పని కరెక్ట్ కాదు.. శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
మహరాష్ట్ర ప్రముఖ నేత ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టు కూడా సాయం చేయలేమని చెప్పేసింది. రాజకీయ సంక్షోభం సమయంలో మహా గవర్నర్ వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని ఒప్పుకున్న సుప్రీంకోర్టు.. ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం కుదరదని తేల్చేసింది. దీనికి కారణం కూడా అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఉద్ధవ్ బలపరీక్ష ఎదుర్కోవడానికి ముందే స్వచ్చందంగా రాజీనామా చేశారని, ఈ కారణంగానే ఆ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం కుదరదని స్పష్టం చేసింది.
శివసేన పార్టీ సంక్షోభం విషయంలో ఉద్ధవ్ థాకరే, షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఉద్ధవ్ మెజార్టీ కోల్పోయారనే నిర్ధారణకు వచ్చేందుకు సరిపోయే సమాచారం లేనప్పుడు మెజార్టీని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని గవర్నర్ పిలిచిన వైనం సరికాదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కానీ ఉద్ధవ్ బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడంతో మళ్లీ ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం కూడా కుదరదని కోర్టు వివరించింది. థాకరే రాజీనామా చేసిన కారణంగా.. అప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు కూడా పొందిన షిండే వర్గంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం సమర్థనీయమేనని స్పష్టం చేసింది.













