మన టెక్నాలజీని అమెరికా అడిగింది : సోమనాథ్
చంద్రయాన్-3 ప్రయోగానికి ముందే ఈ వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను చూసిన అమెరికా, ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అమ్మాలని కోరిందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కంరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. కలాంకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రయాన్-3 వ్యోమనౌకను రూపొందించిన తర్వాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) నిపుణులకు ఒక్కడకు ఆహ్వానించాం. చంద్రయాన్-3 గురించి వివరించాం.
చంద్రయాన్-3లో మనం వినియోగించిన శాస్త్రీయ పరికరాలను చూసిన నాసా నిపుణులు తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారని కొనియాడారు. దీన్ని ఎలా రూపొందించారు? ఈ టెక్నాలజీని మీరు అమెరికాకు ఎందుకు అమ్మకూడదు? అని అడిగారు అని సోమనాథ్ తెలిపారు. చెన్నైలో అగ్నికుల్, హైదరాబాద్లో స్కైరూట్ సంస్థలు రాకెట్లను నిర్మిస్తున్నాయని, ఇలాగే అంతరిక్ష సాంకేతికతతో భారత్ ను మరింత శక్తివంతం చేసే దిశగా రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాలని ప్రజలకు సోమనాథ్ పిలుపునిచ్చారు.













