ఈసీల నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ
ఈసీల నియామకానికి సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ప్రస్తుతం చట్టంపై స్టే విధించలేమని, అలా ఇస్తే గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే కొత్తగా ఈసీ బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ నియామకాలను ప్రస్తావిస్తూ.. వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని, అందువల్ల వారు కేంద్రం కింద పనిచేస్తన్నారని అనకూడదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న వేళ ఎలక్షన్ కమిషనర్ల నియామకంపై, వారి నియామకానికి సంబంధించిన కొత్త చట్టంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే కొత్త చట్టాన్ని అడ్డుకోవాలని, ఈ చట్టం ప్రకారం నియామకాలు చేపట్టకుండా స్టే విధించాలని అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే విధించడానికి నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.
ఇక పిటిషన్లపై స్పందిస్తూ.. ‘‘ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. అలాగే ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పడం సబబు కాదు. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పుగా ఉందని చెప్పలేం. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు స్టే విధిస్తే గందరగోళం ఏర్పడుతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ఎలక్షన్ కమిషన్ల నియామకం కోసం సీజేఐతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ 2023లో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘సీజేఐతో కూడిన తాత్కాలిక కమిటీ పార్లమెంట్ చట్టం చేసే వరకే అమల్లో ఉంటుందని ముందే స్పష్టం చేశాం. చట్టం ఏర్పాటుతో కమిటీ పని పూర్తయింది. అయితే కొత్త చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తాం’’ అని పేర్కొంది.
అంతేకాకుండా ఈ చట్టంపై వస్తున్న పిటిషన్లపై 6 వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.













