కొలీజియం నియామకాలకు బ్రేక్.. ప్రకటించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. కొలీజియంలో ఉన్న ఇద్దరు సీనియర్ జడ్జిలు ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొలీజియం తరపున విడుదల చేసిన ప్రకటనలో సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలో కొలీజియం సమావేశాలు జరగబోవని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే కొలీజియం సమావేశం ఉంటుందని, అప్పుడే హైకోర్టు జడ్జిల నియమకాలు ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం నలుగురు జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరి నియామకం కోసం కొలీజియం సభ్యులకు సీజేఐ జస్టిస్ లలిత్ లేఖ రాశారు. ఈ నియామక ప్రక్రియపై ఇద్దరు జడ్జిలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయినట్లు తెలుస్తోంది.













