నా పదవి నాకు ఇప్పించండి.. కోర్టుకెక్కిన చిన్నమ్మ
గత నెలలోనే జైలు నుంచి రిలీజైన చిన్నమ్మ శశికళ మళ్లీ ఏఐఏడీఎంకే పార్టీపై కన్నేసింది. పార్టీలో అత్యున్నత పదవి అయిన ప్రధాన కార్యదర్శి పదవిని తనకు తిరిగి ఇప్పించాలంటూ ఆమె చెన్నై కోర్టుకు వెళ్లింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలకు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కొన్ని రోజుల్లోనే తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తి రేపుతోంది. రూ.66 కోట్ల ఆక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత గతనెల 27న శశికళ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
2017లోనే ఆమె పార్టీ పదవి నుంచి తప్పిస్తున్నట్లు పళని, పన్నీరు తీసుకొచ్చిన తీర్మానంపై శశికళ కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు మరోసారి తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించడంతోపాటు పిటిషన్ను వెంటనే వినాలని కోర్టును అభ్యర్థించింది. ఈ కేసును మార్చి 15న కోర్టు విచారించనుంది.













