భారత్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు.. వారికి మినహాయింపు
భారత్లో కరోనా ఉధృతి నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. మే 4వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా జో బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైట్ హౌస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సలహా మేరకు భారత్ నుంచి ప్రయాణాలను పరిమితం చేయనున్నట్లు ప్రెస్ సెక్రెటరీ జెన్సాకి పేర్కొన్నారు. అమెరికాలో ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు సంతకం చేశారు. అయితే కొన్ని వర్గాలకు మినహాయింపునిచ్చింది. విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, అమెరికా పౌరులు, గ్రీన్కార్డుదారులు, వారి భార్యలు, 21 ఏళ్ల లోపు పిల్లలకు, కొవిడ్ సహాయ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణిస్తున్న వారిపై ఎలాంటి పరిమితులు ఉండవని విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్ తాజా ఆదేశాలు జారీ చేశారు. కరోనా దృష్ట్యా బ్రెజిల్, చైనా, ఇరాన్, దక్షిణాప్రికాపైనా ఇదే తరహా ఆంక్షలు విధించినప్పటికీ కొన్ని వర్గాలకు మినహాయింపునిచ్చారు. అదే తరహాలో భారత్కు కూడా కొన్ని వర్గాలపై పరిమితులు ఎత్తివేయాలని ప్రతిపాదన రావడంతో విదేశాంగ శాఖ వెంటనే అంగీకరించింది. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













