బ్యాంకింగ్ దిగ్గజం నారాయణ్ వాఘుల్ ఇకలేరు

భారత్ ఆధునిక బ్యాంకింగ్ రూపశిల్పి, ప్రముఖ ప్రైవైట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ్ వాఘుల్ (88) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ్ వాఘుల్ వెంటిలేటర్ మద్దతుపై చికిత్స పొందారని ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పలు సంస్థలకు నాయకత్వ స్థానాల్లో నారాయణ్ వాఘుల్ పని చేశారు. 1985లో భారత్‌లో ప్రారంభమైన ఐసీఐసీఐ బ్యాంకుకు 11 ఏండ్ల పాటు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఒక పబ్లిక్ ఫైనాన్స్ సంస్థగా ఐసీఐసీఐ ప్రైవేట్ బ్యాంకుగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బ్యాంకింగ్ రంగానికి ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషన్ పురస్కారంతో నారాయణ్ వాఘుల్‌ను గౌరవించింది.