త్వరలో రిమోట్ తో ఓటింగ్.. ఎక్కడి నుంచైనా ఓటు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో దీనికి అనుగుణంగా ఎన్నికల పక్రియలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో రిమోట్ ఓటింగ్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోలింగ్ రోజున బూత్‌లకు వెళ్లి లైన్లలో నుంచుని ఓటేసేందుకు గంటలకొద్దీ వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చని, ఎక్కడి నుంచైనా ఓటు వేయొచ్చని తెలిపింది. రిమోట్ ఓటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ విధానం అందుబాటులోకి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల బహుకరణ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ ఆరోరా మాట్లాడుతూ రిమోట్ ఓటింగ్ ఫైలట్ ప్రాజెక్ట్ వచ్చే రెండు మూడు నెలల్లో ప్రారంభం కానుందని అన్నారు. ఐఐటీ మద్రాస్, ఇతర ఐఐటీలకు చెందిన నిపుణులు, టెక్నోక్రాట్స్ రిమోట్ ఓటింగ్ లేదా బ్లాక్‌చైన్ ఓటింగ్ విధానంపై తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. తొలి పైలట్ ప్రాజెక్ట్ రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతుందనే ఆశాభావంతో ఉన్నామని అన్నారు.













