జమిలి ఎన్నికలకు సిద్ధమే : సీఈసీ
జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. ప్రభుత్వం నిర్ణయిస్తే జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చట్టాలకు కొన్ని సవరణలు అవసరం అని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణపై నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదని చెప్పారు.
జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన కొన్నాళ్లకే సునీల్ అరోరా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒకచోట ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లో ఉండి.. అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని ప్రధాని మోదీ ఇటీవల అన్నారు. ఎన్నికల ఖర్చు కూడా పెరుగుతోందన్నారు. అన్నింటికీ ఒకే ఓటర్ల జాబితా ఉండాలని ప్రధాని మోదీ అభిలషించారు. బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సైతం జమిలి ఎన్నికల అంశాన్ని లేవనెత్తింది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు జమ్మిలి ఎన్నికల అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి.













