ఇది భారతీయుల విజయం : మోదీ
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్ చందమామపై అడుగుపెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ అమితానందం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్గా వీక్షించిన ఆయన ఈ ప్రయోగం విజయవంతం అయిన వెంటనే చప్పట్లతో అభినందించారు. మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. ఇలాంటి చారిత్రిక ఘట్టాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, చంద్రయాన్ బృందానికి నా అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారు. ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాం. చంద్రయాన్ ఘన విజయంతో నా జీవితం ధన్యమైంది.
ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు. చంద్రయాన్ విజయం నవభారత జయధ్వానం. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్పైనే ఉంది. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అమృత కాలంలో తొలి ఘన విజయం. ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏ దేశమూ చేరుకోలేదు. మన శాస్త్రవేత్తల కఠోర శ్రమవల్లే ఈ విజయం సాధించగలిగాం. భారత్ సాధించిన ఈ అద్భుత విజయం ఒక్క మన దేశానికి మాత్రమే కాదు. మానవాళి అందరిదీ అని మోదీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.













