గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం దురదృష్టకరం : రాష్ట్రపతి
గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ వేదికగా హింస జరగడం అత్యంత బాధాకరమని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సం దేశానికి పండగలాంటిదని, అలాంటి పండగ సమయంలో జాతీయ జెండాకు అవమానం జరిగిందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విధులతో పాటు బాధ్యతల్ని కూడా పంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
కరోనాతో ఆత్మనిర్భర భారత్ సాకారం
స్వయం సమృద్ధి సాధించాలన్నది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏర్పడ్డ కల అని, కరోనా కారణంగా ఆ వైపుకు అడుగులు వేశామని రాంనాథ్ కోవింద్ అన్నారు. ‘ఆత్మనిర్భర భారత్’’ నినాదంతో స్వయం సమృద్ధి వైపు అడుగులు పడ్డాయని, ఈ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకంగా మారిందన్నారు. పశువుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ పథకం కింద ఏడాదికి 8.2 శాతం వృద్ధి సాధిస్తున్నామని వివరించారు. కరోనాపై భారత పోరాటం స్ఫూర్తిదాయకమని, పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కోన్నామని అన్నారు. కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయని, కోలుకుంటున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
రైతు శ్రేయస్సుకే కొత్త చట్టాలు…
రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఈ చట్టాలతో రైతులకు నూతనమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అయితే సుప్రీం తీర్పును గౌరవిస్తూ వాటి అమలును నిలిపేశామని అన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, దీని కోసమే అనేక చట్టాలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లక్ష 13 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, వ్యవసాయ మౌలిక సదుపాయాల వసతుల కోసం ప్రత్యేక నిధిని కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెన్నై నుంచి పోర్ట్బ్లేయర్ వరకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా అంతర్జాల సేవలను అందుబాటులోకి వచ్చిన వైనాన్ని ఈ సందర్భంగా కోవింద్ ఉభయ సభల దృష్టికి తెచ్చారు.













