అరుదైన ఘనత… మోదీ ప్రశంసల జల్లు
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అరుదైన ఘనత సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చేరుకుని హెల్త్ కేర్ వర్కర్స్‌తో మాట్లాడి అభినందించారు. కొవిడ్ టీకాల పంపిణీలో కీలక పాత్ర పోషించిన వైద్యారోగ్య సిబ్బందిపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఫిబ్రవరి 19న కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా ఇండియా నిలిచింది. ఈ ఏడాది జూన్ 12న 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్తయింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం కంప్లీట్ అయ్యిందని కొవిన్ పోర్టల్‌లో పేర్కొన్నారు.













