పదేళ్లు అధికారంలో ఉన్నా బీజేపీ భయపడుతోంది: డీఎంకే
పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలపై నిందలు వేయడం బీజేపీకే చెల్లిందని డీఎంకే ఎద్దేవా చేసింది. ఇన్నేళ్లు అధికారంలో ఉండి తాను సాధించిన విజయాల గురించి ప్రజలకు చెప్పడం మానేసి ఇప్పటికీ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడంపైనే బీజేపీ దృష్టి సారించింది విమర్శలు చేసింది. ఇటీవల బీజేపీ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించారు. 1974లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని, దానివల్ల ఎంతోమంది తమిళ మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆనాడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్న కీలక తప్పిదంగా అభివర్ణించారు.
“కచ్చతీవు ద్వీపాన్ని ఎంత నిర్ద్వందంగా కాంగ్రెస్ వదులుకుందో చెప్పే కొత్త వాస్తవాలు బయటకొస్తున్నాయి. ఇది ఇందిరాగాంధీ హయాంలో జరిగిన కీలక తప్పిదం. ఇది ప్రతీ భారతీయుడికి కోపం తెప్పించే అంశం. కాంగ్రెస్‌ని ఎప్పటికీ విశ్వసించకూడదని ఈ అంశం మరోసారి నిరూపించింది. భారతదేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరచడమే కాంగ్రెస్ విధానం” అంటూ తన ఎక్స్ పోస్ట్స్ లో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ మోడీ.. తన పోస్ట్ కు ఓ వార్తా కథనాన్ని కూడా జోడించారు.
కాగా.. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ డీఎంకే అధికార ప్రతినిధి ఎస్ మనురాజ్ ఆదివారం ఎక్స్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘‘దాదాపు 50 ఏళ్ల నాటి సమస్యపై ప్రభుత్వం ద్వారా అందిన సమాచారాన్ని, వార్తా కథనాలను ఆధారంగా చేసుకుని ప్రధాని మోదీ ఇప్పుడు కళ్లు తెరవడం ఆశ్చర్యకరం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా బీజేపీ తన సొంత విజయాల గురించి ప్రచారం చేయడానికి భయపడుతోంది. కేవలం ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడంలోనే ఇప్పటికీ బిజీగా ఉంది’’ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడం తప్పే అయినా.. అది కాలం చెల్లిన రాజకీయ సమస్య అని, 50 ఏళ్ల నాటి సమస్య గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు.













