జాతీయ నాయకులతో పోల్చినా.. ప్రధాని మోదీనే అగ్రస్థానం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లోనూ దూసుకెళ్తున్నారు. ప్రసంగాలు, ఇతరత్రా కార్యక్రమాలతో అందుబాటులో ఉండే నరేంద్ర మోదీ అధికారిక ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి సంఖ్య కోటి దాటడం విశేషం. ఈ ఫ్లాట్‌ఫాంలో అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్న గ్లోబల్ లీడర్ల జాబితాలో ప్రధాని మోదీయే ముందువరసలో ఉన్నారు. మొత్తం 36 లక్షల మంది సబ్స్క్రైబర్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండో స్థానంలో ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 30.7 లక్షల మంది సబ్స్క్రైబర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
అమెరికా అద్యక్షుడు జో బైడెన్ 7.30 లక్షల సబ్‌స్కైబర్లు ఉండటం గమనార్హం. వైట్‌హౌస్ అధికారిక ఛానల్‌కు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. జాతీయ నాయకులతో పోల్చినా, ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షలు, శశిథరూర్‌కు 4.39 లక్షలు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు 2.12 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.













